డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంపై అల్లు అర్జున్ స్పందన!
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్ లో తనపై పోలీసులు పరీక్షలు జరిపిన వీడియో మీడియాలో రావడంపై సినీ హీరో అల్లు అర్జున్ స్పందించారు. వాస్తవంగా జరిగిన విషయానికి వ్యతిరేకంగా తప్పుగా చిత్రీకరించే విధంగా ప్రచారం చేయడాన్ని అల్లు అర్జున్ ఖండించారు.
అర్ధరాత్రి సమయంలో బ్రీత్ అనలైజర్ ఊదమని పోలీసులు అడిగారు. మీడియా కెమెరాలు ఉన్నందున తనకు అసౌకర్యంగా ఉందని పోలీసులకు తెలపడంతో వారిని అక్కడ నుంచి తీసుకుపోయారు. ఆతర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిగింది. నేను మద్యం తాగలేదని పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు పంపించారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని హైదరాబాద్ పోలీసులు విడిచిపెట్టరు. తగిన జరిమానా, చర్య తీసుకుంటారు. అని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఇవేమి విషయాలు వెల్లడించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అల్లు అర్జున్ అనే విధంగా వీడియోలను పలు వెబ్ సైట్లలో పెట్టడం దారణమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ నేను మద్యం సేవించినా.. నడిచి వెళ్లడమో.. మరొకరిని డ్రాప్ చేయమని అడగడమో,, లేదా ప్రైవేట్ టాక్సీ, ఆటోలో వెళ్లడానికి ప్రయత్నిస్తాను అని అల్లు అర్జున్ తెలిపారు. తప్పుడు విధానంలో లీకైన వీడియోను వాస్తవ పరిస్థితులకు విభిన్నంగా వెబ్ సైట్లలో పోస్ట్ చేయడం మంచి పద్దతి కాదని అల్లు అర్జున్ అన్నారు.
