
కోలీవుడ్‌పై రన్యా కన్ను
కోలీవుడ్‌లో పాగా వేయాలని తెగ ఆశపడుతోంది కన్నడ జాణ రన్యా. ఆల్‌రెడీ వాగా చిత్రం ద్వారా తమిళచిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ అనుభవాలను ఇక్కడ పంచుకుంది. యువ నటుడు విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వాగా. జీఎన్‌ఆర్.కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయకి రన్యా మాట్లాడుతూ తాను కన్నడంలో సుదీప్‌కు జంటగా మాణిక్య చిత్రం ద్వారా నాయకిగా పరిచయం అయ్యానని తెలిపింది.
ఆ చిత్రం చూసే వాగా చిత్ర దర్శక నిర్మాతలు తనను ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారని చెప్పింది. ఇందులో తాను కశ్మీర్‌లో నివశించే దక్షిణాదికి చెందిన అమ్మాయిగా నటించానని తెలిపింది.తనకు సంబంధించిన సన్నివేశాలను కశ్మీర్, ఊటీ, సాలక్కుడి ప్రాంతాల్లో చిత్రీకరించారని అంది. చిత్రం చివరి ఘట్ట దృశ్యాల్లో అందరం చాలా కష్టపడి నటించామని తెలిపింది. తాను తమిళ భాషలో సంభాషణలు చెప్పడానికి చిత్ర హీరో విక్రమ్‌ప్రభు, దర్శకుడు జీఎన్‌ఆర్.కుమరవేలన్ చాలా హెల్ప్ చేశారని చెప్పింది.
తనకు తమిళ భాష కొంచెం అర్థం అవుతుందని, త్వరలోనే స్పష్టంగా తమిళ భాషను మాట్లాడతానని అంది. ఈ చిత్రంలో తాను డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశానని, అయితే తన మాటల్లో కన్నడ పదాలు దొర్లడంతో వేరే డబ్బింగ్ కళాకారిణితో చెప్పించారని అన్నారు. అయితే వాగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని మరిన్ని తమిళ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానని రన్యా అంటోంది. వాగా చిత్రం విడుదల తరువాత తన నటనను, ఆ చిత్ర విజయాన్ని బట్టి రన్యా ఇక్కడ నిలదొక్కుకునేదీ, లేనిది తెలుస్తుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.