
ఫొటోలు చూడగానే జగపతిబాబు, కల్యాణ్‌రామ్ గురించే న్యూస్ అని ఊహిస్తారు. అల్లుడేంటి? కొడుకేంటి? అని కన్‌ఫ్యూజ్ అయ్యే ఉంటారు. యాక్చువల్లీ కల్యాణ్ రామ్‌కి జగపతిబాబు బావ. మధ్యలో ఈ బావేంటి అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే... ప్రముఖ నటులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్‌ని తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మించనున్న విషయం తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ చేయనున్నారు.
ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగపతిబాబు, కల్యాణ్‌రామ్ పేర్లు తెరపైకొచ్చాయి. ఎన్టీఆర్ తనయుడు, బాలకృష్ణ అన్నయ్య హరికృష్ణ పాత్రకు కల్యాణ్‌రామ్‌ను ఎంపిక చేశారనీ, అల్లుడు చంద్రబాబునాయుడు పాత్ర కోసం జగపతిబాబును అనుకుంటున్నారని టాక్. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రలో అతని తనయుడు కల్యాణ్‌రామ్ నటిస్తే నందమూరి అభిమానులకు డబుల్ ధమాకానే. అటు బాబాయ్ బాలకృష్ణ, ఇటు అబ్బాయ్ కల్యాణ్‌రామ్ తమ తండ్రి పాత్రల్లో ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవడం పక్కా. ఈ పాత్రకు కల్యాణ్‌రామ్ ఫిక్స్. జగపతిబాబు గురించి మాత్రం తెలియాల్సి ఉంది. మరి.. అల్లుడి పాత్రకు జగపతిబాబు ఫైనలైజ్ అవుతారా? వెయిట్ అండ్ సీ.