
విలన్ గా టర్న్ తీసుకున్న తరువాత కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యారు జగపతి బాబు. లెజెండ్ సినిమాతో విలన్ మారిన ఈ సీనియర్ నటుడు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ఇప్పుడు ఉత్తరాది మీద కన్నేశారు. త్వరలోనే ఓ భారీ చిత్రంతో జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ దబాంగ్ సిరీస్ లో మూడో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు జగపతి బాబును తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. అయితే అది విలన్ క్యారెక్టరా.. లేక సహాయ పాత్రా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు తన బాలీవుడ్ ఎంట్రీపై జగపతి బాబు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.