
ఆ విషయంలో నేను చాలా వీక్!
దీపికా పదుకొనే చాలా స్టయిలిష్‌గా ఉంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులంటే కాలేజీ గాళ్స్‌కి తెగ క్రేజ్. మంచి అభిరుచి ఉంది కాబట్టే దీపికా డ్రెస్సులన్నీ బాగుంటాయని కూడా అంటుంటారు. అంత అందంగా డ్రెస్ చేసుకునే దీపిక బహుశా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏమైనా చేశారేమో అని కూడా అనుకుంటారు. ఆ మాటే ఈ బ్యూటీతో అంటూ ‘నేనా.. ఫ్యాషన్ డిజైనింగా.. భలేవారే.. నాకసలు ఫ్యాషన్ గురించి ఏమీ తెలియదు’ అని నవ్వేస్తారు. మరి.. ఇంత స్టయిలిష్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అనే ప్రశ్న దీపిక ముందుంచితే -
‘‘నా ఇంటికొచ్చి నా వార్డ్ రోబ్ చూస్తే, జీన్స్-టీ షర్ట్స్, కాటన్ షర్ట్స్ తప్ప వేరే ఏవీ కనిపించవు. అవి మాత్రమే కొనుక్కోవడం వచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నేను వీక్. అందుకే డిజైనర్ల మీద ఆధారపడిపోతుంటా. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలనుకోండి.. డిజైనర్‌కి ఫోన్ కొడతా. అదెలాంటి ఫంక్షనో చెప్పేస్తా. అందుకు అనుగుణంగా వాళ్లే డ్రెస్ డిజైనింగ్ చేసి ఇచ్చేస్తారు. సినిమాలకు ఎలాగూ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ల మీద ఆధారపడిపోతాను.
కలర్ కాంబినేషన్ కూడా చెప్పడం తెలియదు. వాళ్లేది తయారు చేసిస్తే అది వేసేసుకుంటా. లక్కీగా అన్నీ బాగుంటున్నాయి. దాంతో నాకు మంచి టేస్ట్ ఉందని అనుకుంటున్నారు. నా టేస్ట్ ప్రకారం నేను బట్టలు వేసుకుంటే ఇక అంతే సంగతులు. ‘దీపికా సో బోరింగ్’ అనేస్తారు’’ అని చెప్పారు.