జేమ్స్ కేమరూన్
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరూన్ పేరు చెబితే ముందు ‘టైటానిక్’ సినిమా గురించి మాట్లాడాలా, ‘అవతార్’ గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తాం. కానీ, అంతకుముందే అద్భుతాలు సృష్టించాడాయన. హాలీవుడ్ సినిమాకు ఒక కొత్త అర్థాన్ని, కొత్త రూపురేఖల్నీ పట్టుకొచ్చిన కేమరూన్, ‘టైటానిక్’కు ముందు ప్రతి విషయానికీ కోపంతో ఊగిపోయేవాడట. ఏదైనా తప్పు జరిగితే అందరి మీదా అరిచేవాడట. ‘టైటానిక్’ విడుదలయ్యాక కొన్నాళ్లు కేవలం సముద్రాలను ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు కేమరూన్.
ఆ సమయంలోనే సినిమాలు ముఖ్యమే కానీ, మనుషులు, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నాడట. అప్పట్నుంచీ కేమరూన్ కూల్ పర్సన్. ‘టైటానిక్’కు ముందు నాలుగు పెళ్లిళ్లు బ్రేక్ చేశాడు కేమరూన్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో సుజీ అమిస్‌ను పెళ్లాడి, ఇప్పటికీ ఆవిడతోనే హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు పెళ్లిళ్లు ఎందుకు బ్రేక్ చేశారు? అనడిగితే, కేమరూన్ ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు – ‘‘నా కథల్లో స్ట్రాంగ్ వుమెన్ ఉంటారు. ఇండిపెండెంట్ ఉంటారు.
అలాంటి అమ్మాయిలంటే నాకు బాగా ఇష్టం. లైఫ్‌లోనూ అలాంటి అమ్మాయిలే ఉండాలని కోరుకున్నా. అయితే స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిలతో సమస్య ఏంటంటే, వాళ్లకు నాలాంటి వాడి అవసరం ఉండదు’’ అన్నారు. సుజీ అమిస్ గురించి మాట్లాడుతూ, ‘‘తనకు మాత్రం నేనెందుకో అవసరమయ్యా!’’ అంటూ తన ఐదు పెళ్లిళ్ల గురించి చెబుతున్నాడు జేమ్స్ కేమరూన్. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడాయన.
Comments
Please login to add a commentAdd a comment