Titanic Movie
-
టైటానిక్, అవతార్ నిర్మాత కన్నుమూత
సినీ ప్రపంచంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను తెరెకెక్కించిన హాలీవుడ్ నిర్మాత జోన్ లాండౌ (63) మరణించారు. ఆయన జులై 5వ తేదీనే మృతిచెందారు. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో కలిసి టైటానిక్, అవతార్ సీక్వెల్స్ చిత్రాలను నిర్మించారు. ఆయన మరణ వార్తను లాండౌ కుటుంబం ఆలస్యంగా ప్రకటించింది. అయితే, అందుకు సంబంధించిన కారణాలను వారు వెళ్లడించలేదు. డైరెక్టర్ కామెరూన్‌తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన చిత్రాలు మూడు ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడం విశేషం. ఈ క్రమంలో 1997లో టైటానిక్‌కి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవతార్, దాని సీక్వెల్‌గా వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో సహా చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్స్‌గా రికార్డ్ క్రియేట్ చేశాయి. 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ కెరియర్ను ఆయన ప్రారంభించాడు. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదం వల్ల మునిగిపోవడంతో సుమారు 1500 మంది మరణించారు. ఆ షిప్ మహా జలసౌధ నిర్మాణం, ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో ఉన్నాయని ఆయన గ్రహించాడు. దీంతో కామెరూన్‌తో కలిసి టైటానిక్ అనే సినిమాను నిర్మించి 1997లో విడుదల చేశారు. ఈ చిత్రం 11 అస్కార్ అవార్డులను గెలుచుకుంది. జోన్ లాండౌ నిర్మాతగా 2009లో విడుదలైన చిత్రం అవతార్.. ఈ సినిమా సుమారు రూ.24 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతోంది. అవతార్ 2 కూడా రూ. 19 వేల కోట్లు రాబట్టింది. అయితే, షాకింగ్ విషయం ఏమిటంటే టైటానిక్ చిత్రం 1997లోనే రూ. 18 వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇంతటి భారీ చిత్రాలను నిర్మించిన జోన్ లాండౌ మరణించడంతో హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జోన్ లాండౌకు భార్య జూలీ (45),వారి కుమారులు, జామీ, జోడీ ఉన్నారు. వీరితో పాటు ఆయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. -
విషాదం.. క్యాన్సర్‌తో ‘టైటానిక్’ నటుడు మృతి
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమదైన నటనతో ఎంతో కాలంగా ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఒక్కొక్కరు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. తాజాగా 'టైటానిక్' నటుడు లేవ్ పాల్టర్(94) కన్నుమూశారు.గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్న పాల్టర్ మే 21, 2023న 94న లాస్ ఏంజిల్స్ ఇంట్లో మరణించాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయాన్ని పాల్టర్ కూతురు కేథరీన్ పాల్టర్ మీడియాతో వెల్లడించింది. లేవ్ పాల్టర్ పూర్తి పేరు లియోన్ లూయిస్ పాల్టర్.నవంబర్ 3, 1928న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించాడు. రంగస్థలం నటుడిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టెలివిజన్ రంగంలోనూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ‘టైటానిక్’ మూవీతో పాల్టర్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో డిపార్ట్మెంట్ స్టోర్ మాగ్నెట్ ఇసిడోర్ స్ట్రాస్ పాత్రను పోషించాడు.పాల్టర్ మరణ వార్త తెలియగానే టైటానిక్ టీమ్‌తో పాటు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ‘Titanic’ actor Lew Palter dead at 94 Lew Palter, the actor best known to audiences as Macy’s co-owner Isidor Straus in the 1997 classic “Titanic,” died last month, it was revealed Monday. He was 94. Palter succumbed to lung cancer on May 21, his daughter Catherine told The… pic.twitter.com/mq5Oi7N7ON — Dr.LyndaBarnes (@MrsBarnesII) June 27, 2023 -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
టైటానిక్ టూ అవతార్.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ..!
'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. (ఇది చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత) అయితే ఈ చిత్రంలో టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జేమ్స్ కామెరూన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టైటానిక్ విడుదలైన 25 ఏళ్ల తర్వాత కేట్ విన్ స్లెట్, జేమ్స్ కామెరూన్ మళ్లీ అవతార్-2లో కలిసి పనిచేయడం గమనార్హం. అవతార్ మూవీతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన జేమ్స్ కామెరూన్.. దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్లో పండోరలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపించారు. సామ్ వర్తింగ్టన్, జో సాల్దానా.. జేక్, నేత్రి పాత్రలు పోషించగా.. ఈ అడ్వెంచర్‌లో టోనోవరీ భార్యగా రోనల్ పాత్రలో కేట్ విన్స్లెట్ నటించింది. టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అనుకుంటున్నా. టైటానిక్ విడుదలై 25 ఏళ్లైంది. ఇది చాలా సుదీర్ఘ సమయం. అది నా జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను తల్లిని అయ్యా. జేమ్స్ కామెరూన్ కూడా పేరెంట్ అయ్యారు. మేమిద్దరం కళాకారులం. మేం ప్రయోగాత్మకంగా మరింత సాహసోపేతంగా ఉన్నాం. అదే మా ఇద్దరి మధ్య ప్రధాన వ్యత్యాసం. ఇద్దరి మధ్య సృజనాత్మకమైన తేడాలు చాలా ఉన్నాయి.' అని అన్నారు. -
‘టైటానిక్’ మూవీ హీరోయిన్‌తో పోల్చుకున్న యంగ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అంతేగాక సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. ఇక తన సహా నటీనటులను ఎప్పుడు ఆటపట్టిస్తూ సరదగా ఉండే కార్తీక్ తాజాగా టైటానిక్ మూవీపై స్పందిస్తూ హీరోయిన్ కేట్ విన్స్లెట్తో తనని పోల్చుకున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ కేట్, హీరోని తన స్కెచ్ వేయమని కోరుతూ నగ్నంగా సోఫాలో వాలి ఫోజు ఇస్తుంది. ఈ సనివేశం అందరికి గుర్తుంది కదా. అచ్చం కేట్ లాగే కార్తీక్ కూడా ఫోజు ఇచ్చి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు ‘కార్తీక్ 1- 0 కేట్ విన్స్లెట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇక అతడి పోస్టుపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల కూడా స్పందించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ‘ఉఫ్’ అంటు కామెంట్ చేయగా.. సింగర్ జోనితా గాంధీ ‘ఇది ఏంటో అర్థం కానీ వ్యక్తిని నేను మాత్రమే అనుకుంటా’ అంటు కామెంట్ చేసింది. అది చూసిన కార్తీక్ ‘వెంటనే టైటానిక్ సినిమా చూడు’ అంటు సమాధానం ఇచ్చాడు. అలాగే నెటిజన్లు కూడా ‘టైటానిక్ పార్ట్ 2’, ‘క్యాప్షన్ కింగ్’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన 'టైటానిక్' సినిమా అంటే ఇష్టం ఉండని వారుండరు. సాధారణంగా ఒక సినిమాను రెండు, మూడు లేదా పదిసార్లకు మించి చూడలేరు. ఒకవేళ చూసిన ఆ సినిమా బోర్ కొట్టేస్తుంది. అయితే ఎన్నిసార్లు చూసిన మళ్లీ చూడాలనిపించే చిత్రం టైటానిక్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అద్బుతమైన రొమాంటిక్ క్లాసికల్ డ్రామాగా రియల్ సంఘటనగా ఆధారంగా ‘టైటానిక్’ను దర్శకుడు కామెరూన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో షిప్ మునిగిపోతున్న సమయంలో హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రముఖ హీరో లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు. ఇక హీరోయిన్గా నటించిన కేట్ విన్స్లెట్ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కాగా టైటానిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హీరోయిన్ కేట్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె టైటానిక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌నే మలుపుతిప్పిన ఈ సినిమా అంటే అసలు ఇష్టం ఉండదని, ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం కేట్ అవతార్ సీక్వెల్లో లీడ్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా టైటానిక్ డైరెక్టర్ కామెరూన్ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. -
టైటానిక్‌ను ముంచేశారు
... అవును ‘అవెంజర్స్’ సూపర్ హీరోస్ ‘టైటానిక్’ (1997)ను ముంచేశారు. ఈ విషయాన్ని టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌నే స్వయంగా చెప్పారు. ‘అవెంజర్స్’ ఫ్రాంౖచైజీలో ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేగ్గొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ సినిమా రికార్డులను ఈ చిత్రం దాటేసింది. ఈ విషయంపై జేమ్స్ కామెరూన్ స్పందిస్తూ... ‘‘కెవిన్ ఫీజ్ (నిర్మాత, మార్వెల్ సంస్థ అధినేత) అండ్ అవెంజర్స్ టీమ్.. వాస్తవంలో ఓ మంచుకొండ నిజమైన టైటానిక్ షిప్‌ను ముంచేసింది. కానీ నా ‘టైటానిక్’ను మీ అవెంజర్స్ టీమ్ ముంచేశారు. లైట్స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో భాగస్వాములైన మేమంతా మీ విజయానికి సెల్యూట్ చేస్తున్నాం. సినిమా పరిశ్రమ మరింత ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని మీరు నిరూపించారు’’ అని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ (2009) కలెక్షన్స్‌ని కూడా ‘అవేంజర్స్: ఎండ్‌గేమ్’ దాటేస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ‘అవతార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జేమ్స్ కామెరూన్. ఈ చిత్రం 17 డిసెంబరు 2021న విడుదల కానుంది. -
టైటానిక్‌కు ముందు నాలుగు పెళ్లిళ్లు!
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరూన్ పేరు చెబితే ముందు ‘టైటానిక్’ సినిమా గురించి మాట్లాడాలా, ‘అవతార్’ గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తాం. కానీ, అంతకుముందే అద్భుతాలు సృష్టించాడాయన. హాలీవుడ్ సినిమాకు ఒక కొత్త అర్థాన్ని, కొత్త రూపురేఖల్నీ పట్టుకొచ్చిన కేమరూన్, ‘టైటానిక్’కు ముందు ప్రతి విషయానికీ కోపంతో ఊగిపోయేవాడట. ఏదైనా తప్పు జరిగితే అందరి మీదా అరిచేవాడట. ‘టైటానిక్’ విడుదలయ్యాక కొన్నాళ్లు కేవలం సముద్రాలను ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు కేమరూన్. ఆ సమయంలోనే సినిమాలు ముఖ్యమే కానీ, మనుషులు, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నాడట. అప్పట్నుంచీ కేమరూన్ కూల్ పర్సన్. ‘టైటానిక్’కు ముందు నాలుగు పెళ్లిళ్లు బ్రేక్ చేశాడు కేమరూన్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో సుజీ అమిస్ను పెళ్లాడి, ఇప్పటికీ ఆవిడతోనే హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు పెళ్లిళ్లు ఎందుకు బ్రేక్ చేశారు? అనడిగితే, కేమరూన్ ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు – ‘‘నా కథల్లో స్ట్రాంగ్ వుమెన్ ఉంటారు. ఇండిపెండెంట్ ఉంటారు. అలాంటి అమ్మాయిలంటే నాకు బాగా ఇష్టం. లైఫ్‌లోనూ అలాంటి అమ్మాయిలే ఉండాలని కోరుకున్నా. అయితే స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిలతో సమస్య ఏంటంటే, వాళ్లకు నాలాంటి వాడి అవసరం ఉండదు’’ అన్నారు. సుజీ అమిస్ గురించి మాట్లాడుతూ, ‘‘తనకు మాత్రం నేనెందుకో అవసరమయ్యా!’’ అంటూ తన ఐదు పెళ్లిళ్ల గురించి చెబుతున్నాడు జేమ్స్ కేమరూన్. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడాయన. -
‘టైటానిక్’ రీ–యూనియన్
‘‘జేమ్స్ కేమరూన్ సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే మాత్రం ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతా!’’ 20 ఏళ్ల క్రితం, తన 22 ఏళ్ల వయసులో కేట్ విన్స్లెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ‘టైటానిక్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన సందర్భంగా అందులో నటించిన కేట్, ఆ సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్‌తో సినిమా అంటే ఏ స్థాయిలో కష్టపడాలో చెబుతూ సరదాగా ఈ మాట అన్నారు. ‘టైటానిక్’ 1997లో విడుదలైతే.. ఈ ఇరవై ఏళ్లలో కేట్ విన్స్లెట్ చాలా సినిమాల్లో నటించి, తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. మరోపక్క దర్శకులకే ఒక మార్గదర్శకుడు, వరల్డ్ పాపులర్ డైరెక్టర్‌గా ఎదిగిన జేమ్స్ కేమరూన్ మాత్రం ఈ ఇరవై ఏళ్లలో ఒకే ఒక్క సినిమా తీశారు. అదీ 2009లో వచ్చిన సినిమా వండర్ ‘అవతార్’. ‘అవతార్’ విడుదలైన ఇన్నేళ్లకు ఆ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రెడీ చేస్తోన్న కేమరూన్ ప్రస్తుతం ‘అవతార్ 2’ పనులను మొదలుపెట్టేశారు. మరి రెమ్యునరేషన్ తన మార్కెట్ కంటే ఎక్కువే అడిగారో లేదో కానీ కేట్ విన్స్లెట్ ‘అవతార్ 2’లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమెది కీ రోల్ మాత్రమే! కథను మలుపు తిప్పే పాత్రట. ఈ సినిమా కోసమే ప్రస్తుతం డైవింగ్ కూడా నేర్చుకుంటున్నారు కేట్! 2020 డిసెంబర్లో ‘అవతార్ 2’ విడుదల కానుంది. -
జాక్ చనిపోయి ఉండాల్సింది కాదు!
‘రోజ్... నువ్వు బతకాలి. నాకోసం నువ్వు బతకాలి’. ‘జాక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి’ ‘రోజ్.. నాకు నువ్వు బతకడమే కావాలి.. నన్ను వదిలెయ్. నా చేయి వదిలేయ్’. రోజ్ వదల్లేక వదల్లేక జాక్ చేతిని వదిలేస్తుంది. ‘టైటానిక్’ సినిమా చివర్లో గాఢ ప్రేమికులు జాక్–రోజ్ల సంఘర్షణ ఇది. బండరాయిని ఢీ కొని, ప్రమాదానికి గురైన టైటానిక్ ఓడ సాక్షిగా సముద్రంలోనే సమాధి అయినవాళ్లు, ప్రాణాలను కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు. విరిగిపోయిన ఓ ముక్క మీద రోజ్ ఉంటుంది. జాక్ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్’లో లియొనార్డో డికాప్రియో (జాక్), కేట్ విన్స్లెట్ (రోజ్) తమ నటనతో మైస్మరైజ్ చేశారు. సినిమా చూసిన వాళ్లందరూ దర్శకుడు జేమ్స్ కేమరూన్ కొంచెం కనికరించి, జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనుకున్నారు. కేట్ విన్స్లెట్ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న కేట్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ‘‘విరిగిన ముక్క మీద జాక్కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్ కామెరూన్ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్ చేతిని రోజ్ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్. అంత గాఢమైన ప్రేమకథలో నటించారు కాబట్టి.. ‘టైటానిక్’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏదైనా ఉండేదా? అన్న ప్రశ్నకు –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్ విన్స్లెట్. -
దేవుడిచ్చిన వరం: టైటానిక్ నటి
లాస్ ఏంజెలిస్: విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో తెరకెక్కించిన చిత్రం టైటానిక్. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అస్కార్ వేడుకల్లో అవార్డుల పంట పండించింది. ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లేట్లు జీవితాంతం టైటానిక్ విజయాన్ని మరిచిపోరు. రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా నటుడు డికాప్రియోతో తన రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు. 'టైటానిక్ మూవీ తర్వాత మా ఇద్దరికి చాలా గుర్తింపు దక్కింది. ఇప్పటికీ మా ఇద్దరినీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం టైటానిక్. ఆ మూవీ షూటింగ్లో ఏర్పడ్డ మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంకా చెప్పాలంటే డికాప్రియో నాకు కుటుంబసభ్యుడు లాంటివారు. అతడితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాస్తవానికి మాపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి టైటానిక్ క్లైమాక్స్‌లో జరిగినదే నిజ జీవితంలోనూ జరిగిందంటూ' నటి కేట్ చమత్కరించారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశా
కమెడియన్ రఘు కొవ్వూరు : సినీ రంగంపై మక్కువతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశానని హాస్య నటుడు కారుమంచి రఘు చెప్పారు. శనివారం కొవ్వూరులో జరిగిన ‘టైటానిక్’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను పలకరించగా.. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చొరవతో ఆది సినిమా ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టానన్నారు. దర్శకుడు సురేంద్రరెడ్డి మంచి అవకాశాలు ఇచ్చారని, ప్రేక్షకుల ఆదరణతో హాస్య, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాని వివరించారు. ఇంకా ఏమన్నారంటే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి ఎందుకొచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడు ఆ భావన రాలేదు. సినిమాల్లో అవకాశాలు పెరుగుతుండటం, ప్రేక్షకుల ఆదరణ సంతృప్తినిచ్చాయి. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు 150 తెలుగు సినిమాల్లో నటించా సంతృప్తినిచ్చిన అంశం ఏమిటి గత ఏడాది అత్యధికంగా 25 సినిమాల్లో నటించా. ఈ ఏడాది ఇప్పటికే 20 సినిమాలు చేశా. ఇతర భాషా చిత్రాల్లో నటించారా. టీవీ సీరియల్స్ సంగతేంటి తమిళం, బెంగాలీ భాషల్లో మూడేసి చిత్రాలు, కన్నడంలో రెండు, బోజ్పురిలో ఒక చిత్రంలో నటించాను. టీవీకి సంబంధించి వివిధ సీరియల్స్‌లో 1,500 ఎపిసోడ్స్‌లో నటించాను. టైటానిక్ సినిమాలో మీ పాత్ర ఏమిటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాను. అన్ని క్యారెక్టర్ల వారితో నటించే అవకాశం లభించింది.