'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ
టైటిల్ : జనతా గ్యారేజ్
జానర్ : ఎమోషనల్ యాక్షన్ డ్రామా
తారాగణం : ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్, రెహమాన్, సురేష్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాత : నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్, సివి మోహన్
వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందించి హ్యాట్రిక్ రేసులో ఉన్న కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై రిలీజ్కు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను జనతా గ్యారేజ్ అందుకుందా..? కొరటాల శివ హ్యాట్రిక్ హిట్ సాధించాడా..? ఎన్టీఆర్ తన విజయ పరంపర కొనసాగించాడా..?
కథ :
పల్లెటూళ్లో మెకానిక్గా పనిచేస్తూ తన తమ్ముడి(రెహమాన్)ని ఉన్నత చదువులు చదివిస్తాడు సత్యం( మోహన్ లాల్). సత్యం కష్టంతో ఎదిగిన తమ్ముడు సత్యంతో సిటీలో గ్యారేజ్ పెట్టిస్తాడు. కష్టం అంటూ తన దగ్గరికి వచ్చే ఏ మనిషికైనా సాయం చేసే అలవాటున్న సత్యం, తన జనతా గ్యారేజ్ దగ్గరికి వచ్చి కష్టం అని అడిగిన వారికి ఎలాంటి సాయం చేయడానికైనా వెనుకాడడు. దీంతో ఎంతో మందికి దేవుడైన సత్యం కొంత మందికి శత్రువు కూడా అవుతాడు. అదే గొడవల్లో తన తమ్ముణ్ని కొల్పోతాడు. అయినా తన పద్దతులు మాత్రం మార్చుకోడు.
అలా పాతికేళ్లు గడిచిపోతాయి, సత్యం మీద హత్యా ప్రయత్నం జరగటంతో ఆయన్ని గొడవలకు దూరంగా ఉంచాలని అతని అనుచరులు నిర్ణయించుకుంటారు. జనతా గ్యారేజ్కు కష్టం అంటూ వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. అదే సమయంలో ముంబైలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివే ప్రకృతి ప్రేమికుడు ఆనంద్(ఎన్టీఆర్) హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్ వచ్చిన ఆనంద్, సత్యాన్ని ఎలా కలిసాడు..? వారి ఇద్దరి మద్య ఉన్న బంధం ఏంటి..? జనతా గ్యారేజ్కు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
గతంలో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ఇటీవల కాస్త రూట్ మారుస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో కొత్తగా కనిపించిన జూనియర్ ఈ సినిమాలో కూడా న్యూ స్టైల్లో కనిపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా భారీ డైలాగ్ల లాంటివి లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే మనమంతా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మోహన్ లాల్, తన అద్భుతమైన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. హీరోయిన్లుగా నటించిన సమంత, నిత్యామీనన్లు తెర మీద కనిపించింది కొద్ది సేపే. ఇతర పాత్రల్లో ఉన్ని ముకుందన్, రెహమాన్, బ్రహ్మజీ, బెనర్జీ, రాజీవ్ కనకాల, మెయిన్ విలన్గా సచిన్ కేడ్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణులు :
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో కమర్షియల్ జానర్లోనే సందేశాన్ని అందించిన కొరటాల శివ, ఈ సినిమాలోనూ అదే ప్రయత్నం చేశాడు. కథ పరంగా బాగానే అనిపించినా కథనంలో కాస్త వేగం తగ్గినట్టుగా అనిపించింది. ముఖ్యంగా విలన్ పాత్రను బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవటం, క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ఉండటం నిరాశపరుస్తోంది. దర్శకుడిగా కాస్త తడబడినా.. రచయితగా మాత్రం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచాడు కొరటాల శివ. ఎక్కడ గొంతు చించుకొని చెప్పే డైలాగ్స్ లేకపోయినా.. చాలా డైలాగ్స్ గుర్తుండిపోయాలే ఉన్నాయి. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్కు దేవీ సంగీతం మరింత హైప్ తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ఎన్టీఆర్, మోహన్ లాల్
సంగీతం
కథ
మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్
ప్రతినాయక పాత్ర
ఓవరాల్గా జనతా గ్యారేజ్.. ఎన్టీఆర్లోని మరో కోణాన్ని తెరమీద ఆవిష్కరించే ఎమోషనల్ డ్రామా
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్