
‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మేము కోరుకున్నాము. నువ్వు ఇక్కడ ఉన్నావు. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మేము పరిపూర్ణమయ్యాము. నేను కోరుకున్న అన్నింటితో పాటు ప్రత్యేకమైన ఈ కానుక ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. నా బెస్టీ ఇక్కడ ఉంది. నా జీవితం మార్చేసింది’ అంటూ మోడల్, టీవీ నటి మహి విజి తాను తల్లిని అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కూతురి పాదాలను ముద్దాడుతున్న భర్త ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి మహి విజి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హిందీ టీవీ స్టార్ కపుల్ మహి విజ్-జై భనుశాలిలకు 2011లో వివాహం జరిగింది. ఈ క్రమంలో 2017లో ఈ జంట తమ పనిమనిషి కూతురిని దత్తత తీసుకున్నారు. అయితే ఆమె కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నా తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
ఇక పెళ్లైన దాదాపు 8 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారడంతో ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కూతురి రాక గురించి జై చెబుతూ...’మా భవిష్యత్తు ఇప్పుడే ఈ లోకంలోకి వచ్చింది. మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజకుమారి’ అంటూ ఓ ఆత్మీయ సందేశాన్ని పోస్ట్ చేశాడు. కాగా మోడల్ అయిన మహి పలు హిందీ సీరియళ్లలో నటించి అవార్డులు పొందారు. తెలుగులో డబ్ అయిన ‘చిన్నారి పెళ్లి కూతురు’(బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. అదే విధంగా జై కూడా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మించే సీరియళ్లలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. మహి- జై జంట టీవీ రియాలిటీ షో ‘నచ్ బలియే 5’లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment