నేను ప్రేమించినప్పుడు మాట్లాడతా!
‘‘బహుశా.. సినిమాల్లో నటించే పాత్రలు నటీనటులపై ప్రభావం చూపుతాయేమో! అందువల్లే, ‘మాకంటూ ఓ సొంత లైఫ్ లేదు, డిప్రెషన్‌లోకి వెళ్లాం’ అని చాలామంది చెబుతున్నారనుకుంటున్నా. నేను సాయంత్రం ప్యాకప్ చెప్పగానే... నటించే పాత్ర నుంచి బయటికొచ్చేస్తా’’ అన్నారు రకుల్‌ప్రీత్‌సింగ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా ‘జయ జానకి నాయక’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. రకుల్ చెప్పిన విశేషాలు...
⇒ జానకి... బబ్లీ అండ్ హ్యాపీ కాలేజ్ గాళ్. కుటుంబమంటే ప్రేమ. ఏ పని చేయాలన్నా తానే ముందడుగు వేస్తుంది. ఓ ఘటన వల్ల అటువంటి అమ్మాయి లైఫ్ మొత్తం మారుతుంది. ఆ ఘటన ఏంటి? ఆమె లైఫ్ ఎలా మారింది? అనేది చిత్రకథ. ఈ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జానకిగా నేను నటించాను.
⇒ కొన్ని పోస్టర్స్ చూస్తే నేను స్యాడ్‌గా, డల్‌గా కనిపిస్తా. ఇటువంటి ఎమోషనల్ పాత్రను నేనిప్పటి వరకు చేయలేదు. అందువల్ల సెట్‌లో ఉన్నంతసేపూ నా ప్రపంచానికి దూరంగా, డల్‌గా ఉండేదాన్ని. లేదంటే రోజంతా క్యారెక్టర్‌కు కావలసిన మూడ్‌లో ఉండలేం. ఓ రోజు షూటింగులో ఉన్నప్పుడు ‘నాతో రెండు నిమిషాలు మాట్లాడలేవా?’ అని మా అమ్మ ఫోన్ చేస్తే... ‘నో మమ్మీ’ అని పెట్టేశా. బోయపాటిగారయితే అప్పుడప్పుడూ ‘షాట్ అయ్యిందమ్మా... కొంచెం నవ్వొచ్చు’ అనేవారు. (నవ్వులు) ఓ నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత డల్‌గా నటించడం కొంచెం కష్టమనిపించింది.
⇒ ఏడుపు సీన్స్ కోసం గ్లిజరిన్ వాడారా? అనడిగితే... అవును! నా లైఫ్‌లో గ్లిజరిన్ లేకుండా ఇప్పటివరకు ఎప్పుడూ ఏడవలేదు. అలా ఏడ్చే సందర్భం రాదనుకుంటున్నా. ఈ సినిమా కోసం గ్లిజరిన్ వాడి వాడి సాయంత్రానికి నా కళ్లు వాచిపోయేవి. సరదాగా బోయపాటిగారితో ‘సార్... ఈ షెడ్యూల్ పూర్తయ్యేసరికి నేను ఓల్డ్ అవుతా. ఏడ్చి ఏడ్చి రెండు చెంపలపై చారలు వచ్చేస్తాయి’ అన్నాను.
⇒ బోయపాటిగారు చాలా స్మార్ట్. ఎందుకంటే... ఆయన ఎలాంటి సినిమా తీస్తున్నారో? ఏం తీస్తున్నారో? కథలో బలం ఏంటో? ఆయనకు బాగా తెలుసు. గొప్ప ప్రేమకథ, కుటుంబ విలువలు ఉన్న సినిమా ఇది. జానకి చుట్టూ కథంతా తిరుగుతుంది కాబట్టి... ‘జయ జానకి నాయక’ టైటిల్ పెట్టారు. బోయపాటిగారి నుంచి డిఫరెంట్ ట్రీట్మెంట్‌లో వస్తున్న సినిమా. ఆయన సిగ్నేచర్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది.
⇒ బోయపాటిగారితో ‘సరైనోడు’ చేశాను. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఈ ఆఫర్ వచ్చింది. ఆయనేంటి? సినిమా ఎలా తీస్తారనేది తెలుసు. అందుకని సాయి శ్రీనివాస్ కొత్త హీరో కదా? అని ఆలోచించకుండా, వెంటనే ఒప్పేసుకున్నా. సాయి అద్భుతంగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సూపర్బ్. మా నిర్మాత రవీందర్‌రెడ్డిగారు చాలా మంచి వ్యక్తి. మంచి సినిమా తీయాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.
⇒ ‘లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్‌ను వదులుకోం. కానీ, ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే... నేను ప్రేమించా’ అని ట్రైలర్‌లో డైలాగ్ ఉంది. అటువంటి పరిస్థితి మీకొస్తే? అని రకుల్‌ను ప్రశ్నించగా... ‘‘ఫస్ట్ నా లైఫ్‌లో లవ్ రావాలి. అది వచ్చినప్పుడు... నేను ప్రేమించినప్పుడు మాట్లాడతా’’ అన్నారు.
⇒ ప్రస్తుతం హిందీలో ‘అయ్యారే’, తమిళంలో సూర్య సరసన ఓ సినిమా చేస్తున్నా. మహేశ్‌బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన ‘స్పైడర్’ వచ్చే నెల్లో విడుదలవుతుంది.