జానకీనాయకుడి విజయోత్సవం
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయోత్సవం శనివారం కృష్ణాజిల్లాలోని హంసలదీవిలో జరిగింది. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ– ‘‘పవిత్రమైన హంసలదీవిలో ‘జయ జానకి నాయక’ షూటింగ్ జరగడం ఈ చిత్రవిజయానికి ముఖ్య కారణమని భావిస్తున్నాం.
ఈ చిత్రం విజయోత్సవం చేయడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ మాకు దొరకలేదు. శ్రీనివాస్ సూపర్‌గా యాక్ట్ చేశాడు’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘మా చిత్రానికి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. ఇవాళ 120 థియేటర్లు పెరిగాయంటే కారణం ప్రేక్షకులు ఇచ్చిన సపోర్టే. ఇకనుంచి ఇంతకంటే మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కృషి చేస్తాను. నేను జీవితంలో గర్వంగా చెప్పుకొనే సినిమా ఇది.
ఇలాంటి గర్వించదగ్గ చిత్రాన్ని ఇచ్చినందుకు బోయపాటి శ్రీనుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అసలు ‘హంసల దీవి’ అనే ప్లేస్ ఒకటి ఉందని నాకు తెలీదు. మా బోయపాటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేయించాడు. రెండో వారంలో సినిమా థియేటర్లు పెరగడం అంటే చిన్న విషయం కాదు. బోయపాటి సత్తా ఇది. అన్నీ తానై సినిమాని నడిపించారు’’ అన్నారు జగపతిబాబు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.