అమ్మ ఛాయిస్ ఐశ్వర్యే!
అమ్మ.. చిన్నమ్మ... ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా ఈ ఇద్దరు అమ్మల గురించే. ఆ మాటకొస్తే పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ ఇద్దరు అమ్మల గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మ (జయలలిత) చనిపోయాక సీన్లోకి చిన్నమ్మ (శశికళ) రావడం, రాజకీయంగా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే... అమ్మ జీవితం ఆధారంగా సినిమా చేయాలని కొంతమంది దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి చర్చల గురించి ఎలా ఉన్నా, బతికున్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ తన జీవితం ఆధారంగా సినిమా చేస్తే, అందులో ఐశ్వర్యారాయ్ నటిస్తే బాగుంటుందని స్వయంగా అమ్మే చెప్పారు.
‘‘నేను యవ్వనంలో ఉన్నప్పటి పాత్రకు ఐశ్వర్యారాయ్ చక్కగా సూటవుతారు. ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కూడా నటించడం పెద్ద కష్టమేమీ కాదు. నటిగా ఐశ్వర్యకు అపారమైన ప్రతిభ ఉంది’’ అని ఆ ఇంటర్వ్యూలో జయలలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా మణిరత్నం తీసిన ‘ఇద్దరు’లో జయలలితను గుర్తుచేసే పాత్రలో ఐశ్వర్య నటించిన విషయం గుర్తుకు రాక మానదు. ఇప్పుడు అమ్మ జీవితకథతో ఎవరైనా సంప్రదిస్తే ఆమె ఏమంటారో! వెయిట్ అండ్ సీ! ఇదిలా ఉంటే... ఆల్రెడీ కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది హీరోయిన్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో దర్శకుడు ఫైజల్‌సైఫ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.