
జయసూర్య
కొత్త సినిమా గురూ!
పోలీస్ స్టోరీస్ అంటే... కామన్‌గా ఉండే పాయింట్ ‘అవినీతిపరులను అంతం చేయడం’. ఈ కామన్ పాయింట్‌తో ఓ కొత్త రకం కథను క్రియేట్ చేయడం, దాన్ని జనరంజకంగా తెరకెక్కించడంలోనే దర్శకుడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. పోలీస్ పాత్రలో హీరో ఎంతగా విజృంభిస్తే అంతగా ప్రేక్షకులకు ఆ పోలీస్ కథ నచ్చుతుంది. తాజాగా పోలీస్ స్టోరీతో తెరపైకి దూసుకొచ్చిన ‘జయసూర్య’ ఎలా ఉంటుంది? పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని పర్‌ఫెక్ట్‌గా చేసే విశాల్, పవర్‌ఫుల్ చిత్రాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న సుశీంద్రన్‌కాంబినేషన్‌లో వచ్చిన ఈ పోలీస్ భేష్ అనిపించుకుంటాడా? చూద్దాం...
కథేంటంటే...
అది గుంటూరు. భవానీ గ్యాంగ్ లేకపోతే అంతా ప్రశాంతంగానే ఉండేదేమో. కానీ, ఈ గ్యాంగ్ గుంటూరుని గడగడ వణికిస్తుంది. బడా వ్యాపారవేత్తలను కోట్లు ఇవ్వమని బెదిరించి, వాళ్లు ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా హత్య చేసేస్తుంది. వీళ్లని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యంలో ఆల్బర్ట్ (హరీష్ ఉత్తమన్) అనే పోలీసాఫీసర్‌ని ఆ గ్యాంగ్ చంపేస్తుంది. కొడుకు చనిపోయిన బాధలో ఎలాగైనా భవానీ గ్యాంగ్‌ని అంతం చేయాలని సూసైడ్ నోట్ రాసి, అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సవాల్‌గా నిలిచిన ఈ గ్యాంగ్‌ని ఏరిపారేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయసూర్య (విశాల్)ను వైజాగ్ నుంచి గుంటూరు రప్పిస్తుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. అక్కడ జయసూర్యకు సౌమ్య (కాజల్ అగర్వాల్) తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు.
మరో పది రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన జయసూర్య అండర్ కవర్ కాప్‌గా వ్యవహరిస్తూ, భవానీ గ్యాంగ్‌లోని ఒక్కొక్కర్ని చంపేస్తుంటాడు. చివరికి భవానీని చంపే స్తాడు. అతను చనిపోతూ ‘మా ముఠాని అంతం చేశాననుకుంటున్నావేమో.. మా వెనకాల ఓ పెద్ద తలకాయ ఉంది’ అని చెప్పి, చనిపోతాడు. ఆ తర్వాత జయసూర్య అఫీషియల్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. ఆ పెద్ద తలకాయ ఎవరనేది అతనికి పెద్ద సవాల్‌గా నిలుస్తుంది. ఇదిలా ఉంటే, పెద్దల సమ్మతంతో జయసూర్యకు, సౌమ్యకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ, సౌమ్య తండ్రి హత్యకు గురవుతాడు. ఆ హత్య వెనకాల ఉన్నది ఎవరు? అనేది జయసూర్యకు మరో సవాల్. తీవ్రంగా ప్రయత్నించిన మీదట భవానీ గ్యాంగ్ వెనక ఉండి నడిపించిన ఆ వ్యక్తి ఎవరో జయసూర్యకు తెలిసిపోతుంది. కానీ, నీరసపడిపోతాడు.. షాకవుతాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? జయసూర్య ఎందుకు నీరసపడ్డాడు? అతనికీ, జయసూర్యకు ఉన్న లింక్ ఏంటి? అతన్ని జయసూర్య ఏం చేశాడు? అనేది మిగతా కథ.
నిజజీవిత కథ ఆధారంగా...
ఆల్విన్ సుదన్ అనే సబ్ ఇన్స్‌పెక్టర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునిదర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జయసూర్య పాత్రలో విశాల్‌కి మల్టిపుల్ షేడ్స్ చూపించే అవకాశం దక్కింది. యాక్షన్, ఇంటెలిజెన్స్, కామెడీ, రొమాన్స్... వీటిని సమర్థవంతంగా క్యారీ చేయడంతో పాటు ఎమోషన్స్‌ని కూడా విశాల్ బాగా హ్యాండిల్ చేయగలిగారు. టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని సముద్రఖని బాగా చేశారు. కాజల్ అగర్వాల్ గ్లామరస్‌గా ఉన్నారు. డి. ఇమామ్ స్వరపరచిన పాటలకన్నా అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని, సెంటిమెంట్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. వేల్‌రాజ్ కెమెరా వండర్స్ చేసిందనే చెప్పాలి.
థ్రిల్‌కి గురి చేసే ట్విస్ట్‌తో...
రెండేళ్ల క్రితం విశాల్‌తో ‘పాండియనాడు’ (తెలుగులో ‘పల్నాడు’)వంటి హిట్ చిత్రం తీసిన సుశీంద్రన్ మళ్లీ విశాల్‌తో తీసిన చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అందుకే మొదట్నుంచీ చివరి వరకూ థ్రిల్‌కి గురి చేసేలా తీయాలని దర్శకుడు అనుకుని ఉంటారు. ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి ప్రేక్షకులను ఇన్‌వాల్వ్ చేయడానికి కొంచెం పేస్ తగ్గించారు. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఊహించని ఓ ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్ చూసే తీరాలని ప్రేక్షకులను ప్రిపేర్ చేశారు. ఫస్టాఫ్ మొత్తం భవానీ గ్యాంగ్ అరాచకాలు, వాళ్లని పోలీసులు వెంటాడటం, హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, రిలీఫ్ కోసం అన్నట్లు కొంత కామెడీ, పాటలు లేకపోతే డాక్యుమెంటరీ అనుకునే ప్రమాదం ఉందని పాటలు.. లాంటి వాటితో ఇంటర్వెల్‌కి థ్రిల్లింగ్ క్లోజర్ ఇచ్చారు.
సెకండాఫ్‌లో విలన్ ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఒక్కసారిగా థ్రిల్ అవుతారు. అతన్ని హీరో ఎలా తెలుసుకుంటాడు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. విలన్ ఎవరో హీరో తెలుసుకున్నాక ఎలా అంతం చేస్తాడు? అనేది ఇంకా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అతన్ని చంపడానికి హీరో తన ఎమోషన్‌ను కూడా చంపుకోవాల్సి వస్తుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లోని సన్నివేశాలను పోలినవి ఈ చిత్రంలో కొన్ని ఉన్నప్పటికీ... ఆ పోలికలతో చూడకుండా ఒక ఎక్స్‌పీరియన్స్‌గా చూస్తే మాత్రం సినిమా బాగున్నట్లనిపిస్తుంది.