పెళ్లి గురించి అడిగితే మైక్ విసిరికొట్టిన హీరో
ప్రేమలు పలు విధములు. వ్యక్తీకరణలు(ఎక్స్ ప్రెషన్స్) బహువిధములు. మనసు దోచిందనో, మాయ చేసిందనో, మోసంతో వంచన చేసిందనో లేక విధికి తలవంచి వీడిపోయిందనో.. మాజీ ప్రియురాళ్లపై ప్రియులు లేదా మాజీ ప్రియులపై ప్రియురాళ్లు అప్పుడప్పుడూ నోరుపారేసుకోవటం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేయటం(నిజానికి ఇవి కూడా ప్రేమ వ్యక్తీకరణలే) లాంటివి చేస్తుంటారు. ఇప్పడు వంతు బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో జాన్ అబ్రహామ్ ది.
ఏళ్లకిందటే ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్(వైవాహికంగా) అయిపోయిన జాన్.. మాజీ ప్రేయసికి సంబంధించిన ప్రశ్నను ముల్లులా భావించాడు. 'బిపాషా బసూ పెళ్లి చేసుకోబోతోందికదా.. మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగిన పాపానికి విలేకరిపై అంతెత్తు ఎగిరిపడ్డాడు. కోపంగా మైక్ విసిరికొట్టి, ఆగ్రహంతో వెళ్లిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన జరిగింది. హీరో ప్రదర్శించిన అసహనం అఅక్కడున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొంత మంది మాత్రం 'ప్రేమ పలు విధములు.. వ్యక్తీకరణలు బహువిధములు..' అనుకున్నారట!
'డ్రీమ్ కపుల్'గా ముద్రపడ్డ జాన్ అబ్రహాం, బిపాషా బసులు తొమ్మిదేళ్లపాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జాన్ అబ్రహాం.. తన స్నేహితురాలు ప్రియా రాంచల్ను ప్రేమ వివాహం చేసుకోగా, ఇప్పుడు బిపాషా తన సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను ప్రేమించి పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 30వ తేదీన వీరి వివాహం జరుగనుంది. వివాహానికి సంబంధించిన వేడుకల్లో మునిగి తేలుతుంది పెళ్లికూతురు. మొహమాటానికైనా జాన్కు ఇన్విటేషన్ పంపలేదట బిపాషా బసు. ఇదిలాఉంటే బిప్స్ మరో మాజీ ప్రేమికుడు డినోమారియా మాత్రం 'తను పిలవకపోయినా బిపాషా పెళ్లికి వెళతాను'అని మరో తరహా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.