
ఆ రెండూ వస్తే ఆనందమే!
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్, ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్... రెండూ చేయగల ప్రతిభ ఉన్న హీరో చిన్న ఎన్టీఆర్. చిన్న వయసులోనే ‘ఆది’లో రెచ్చిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. భారీ మాస్ మూవీస్ చేస్తూ, ‘నాన్నకు ప్రేమతో’ వంటి క్లాస్ టచ్ ఉన్న ఎమోషనల్ మూవీ చేసి, భేష్ అనిపించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ....
ఇప్పుడు కథల ఎంపికలో మీ పద్ధతి మారినట్టుంది?
ప్రపంచమే మారుతోంది. ఒకప్పటిలా పద్ధతులు, ధోరణులు ఇప్పుడు లేవు. మనుషుల్లో కూడా చాలా మార్పొచ్చింది. మొక్కలు, ప్రకృతి కూడా మారుతున్నాయి. అందులో మనం (ప్రజలు) ఎంత? మనంలో హీరోలు ఎంత? అనేది నా ప్రశ్న. మేం చాలా చిన్న కణాలు మాత్రమే (నవ్వుతూ). తప్పకుండా మారాలి. నేను కథలు ఎంపిక చేసుకునే విషయంలో మార్పు వచ్చింది. ఆ మాటకొస్తే, తెలుగు పరిశ్రమలో మంచి మార్పు వస్తోంది. పెళ్లి చూపులు’, ‘మనమంతా’ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.
కథల ఎంపికలో మీలో మార్పు రావడానికి ప్రధాన కారణం?
వంద శాతం ప్రేక్షకులే. సినిమాలు చేసేది ప్రేక్షకుల కోసమే. కొన్ని చిత్రాలు వద్దని వాళ్లు గట్టిగా చెంప దెబ్బ కొట్టారు. దాంతో నేను మారాను. బహుశా.. మిగతావాళ్లకీ తగిలినట్టున్నాయి, మారుతున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తెలుగులో కొత్త కథలు వస్తాయి.
కానీ, స్టార్ హీరో సినిమా అంటే కొన్ని ఎలిమెంట్స్ తప్పనిసరి కదా..?
(సీరియస్‌గా).. మన అభిప్రాయాలను అభిమానులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకుల్లో అటువంటి అంచనాలు లేవని నా నమ్మకం. వారసత్వాన్ని, స్టార్ హీరో ట్యాగులను నేను నమ్మను. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఇలా ఉంటుందని నేను చెప్పలేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కథ, కథనం బాగున్నప్పుడు సినిమా బాగుంటుంది. ‘జనతా గ్యారేజ్’ అటువంటి సినిమా. గొప్ప కుటుంబ కథా చిత్రమిది. సినిమాలో కథే హీరో. చాలా అరుదుగా ఇటువంటి కథలు దొరుకుతాయి. మోహన్‌లాల్, సమంత, నిత్యా.. సినిమాలో గొప్ప నటీనటులున్నారు. సమాజం పట్ల బాధ్యతతో కూడిన అంశాలు ఇందులో ఉన్నాయి.
సీనియర్ నటుడు మోహన్‌లాల్ నుంచి మీరేం నేర్చుకున్నారు?
ఆనందంగా ఉండడం. చాలా హ్యాపీగా ఉంటారాయన. ఎటువంటి అవరోధాలూ లేకుండా చాలా హ్యాపీగా నేను కూడా అంత ఆనందంగా ఉండాలి. (నవ్వుతూ..) ఆయన్ను చూసి అది ప్రాక్టీస్ చేస్తున్నాను. నటుడిగా మోహన్‌లాల్ గురించి చెప్పేదేముంది? హి ఈజ్ కంప్లీట్ యాక్టర్.
దర్శకుడిగా రెండు సినిమాల అనుభవం ఉన్న కొరటాలపై అపనమ్మకం ఏదైనా ఉండేదా?
ఓ దర్శకుడి శక్తిసామర్థ్యాలు చూడకుండా మాట్లాడకూడదు. ఫస్ట్‌డే షూటింగ్ పూర్తయిన తర్వాత శివ ఏదైనా హ్యాండిల్ చేయగలడనే నమ్మకం వచ్చింది. చాలా అనుభవమున్న దర్శకుడిలా సినిమా తీశారు.
నటుడిగా మంచి పేరొస్తే హ్యాపీగా ఫీలవుతారా? సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయితే హ్యాపీగా ఫీలవుతారా?
అదృష్టమో.. దురదృష్టమో.. వసూళ్ల చట్రంలో ఇరుక్కున్నాం. ఆ పద్ధతి ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. నటుడిగా మంచి పేరు.. బ్లాక్‌బస్టర్ హిట్.. రెండూ వస్తే హ్యాపీ. నిర్మాతలకు లాభాలు రావడమూ ముఖ్యమే. వసూళ్ల గురించి పక్కన పెడితే ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాను.
మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశానన్నారు. జయాపజయాలను సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ఊహించలేమా?
అద్దంలో మన ముఖం చూసి ఆనందంగా ఉన్నామా? లేదా? అని మనకు మనం ప్రశ్నించుకున్నప్పుడు, స్వీయ విశ్లేషణ చేసుకున్నప్పుడు జయాపజయాలు తెలుస్తాయి. మనలో మంచీ చెడూ మనకే తెలుస్తాయని నా గట్టి నమ్మకం.
ఫలానా సినిమాలో ఇంకా బాగా చేసుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
ప్రతి మనిషికీ తనలో ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. కానీ, ఓసారి నటించేసిన తర్వాత ‘అలా కాకుండా, ఇలా చేస్తే బాగుండేదేమో’ అనే ఆలోచన మన బ్రెయిన్‌లో రాకూడదు. గతం గతః. ఈ క్షణంలో జీవించడానికి ఇష్టపడతాను. ఈ క్షణాన్నే నమ్ముతాను. ఓ సినిమాలో నటించిన తర్వాత ‘వాట్ నెక్ట్స్?’ అని ఆలోచిస్తా. చివరి చిత్రం గురించి ఆలోచించను.