
భూత్ బంగ్లాలో బాదుడు!
‘అమ్మతోడు... అడ్డంగా నరికేస్తా’ వంటి డైలాగులు చెప్పడం లేదు. అడ్డొచ్చినోణ్ణి ఉతికారేస్తున్నారు ఎన్టీఆర్. ఎవడైతే తన దారికి అడ్డంగా నిలబడతాడో... వాళ్లను బాదుడే బాదుడు. మామూలు బాదుడు కాదది. ఓ రేంజ్‌లో బాదుతున్నాడు. మేటర్ ఏంటంటే... ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ‘జై లవ కుశ’ అనే సినిమా నిర్మిస్తున్నారు కదా! దీని కోసం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో రావణాసురుడి సెట్ వేశారు. ఇప్పుడీ సెట్‌లో ఫైట్ తీస్తున్నారు.
జస్ట్ ఫైవ్ డేస్‌లో కంప్లీట్ కానున్న ఈ ఫైట్ కోసమే సెట్ వేయడం స్పెషాలిటీ. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నారు. ఆ పాత్రల పేర్లు జై, లవ, కుశ. మరి, ఏ ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నారనే డౌట్ వచ్చిందా? పెద్దోడు ‘జై’ చేస్తున్నాడు. ఇప్పటివరకు చేసిన షూటింగ్‌తో 40 శాతం సినిమా పూర్తయింది. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా, నందిత ముఖ్య తారగా నటిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే. ఆ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు.