ఈసారి ఆస్కార్ నీదే అన్నారు! - ఉత్తమ నటి జూలియన్ మూర్ (స్టిల్‌ఎలైస్)
‘‘నేను శ్రమను నమ్ముతాను. అలాగే, నిజమైన అనుబంధాలను, నిజాయతీ గల వ్యక్తులను, మంచి కుటుంబాలను నమ్ముతాను. ఇవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అందుకే చేశాను. వాస్తవానికి ఈ చిత్రం చేస్తున్నప్పుడు నా భర్తకు చెప్పలేదు. ఏకంగా సినిమా చూపిద్దామనుకున్నా. ఇద్దరం కలిసి ప్రివ్యూ చూశాం. సినిమా చూసి, బయటికొస్తున్నప్పుడు ‘ఈ ఏడాది ఆస్కార్ నీదే’ అన్నారు. ఈ తరహా చిత్రాలు విజయం సాధించడానికి కారణం.. ప్రేక్షకులు తమను తాము ఆ పాత్రల్లో ఊహించుకోవడంవల్లే’’ అంటూ ఓ విధమైన ఉద్వేగానికి గురవుతూ అన్నారు.
ఇదో అద్భుతమైన కల.. ఇప్పట్లో మేలుకోలేను! - ఉత్తమ నటుడు ఎడ్డీ రెడ్‌మెయిన్ (ది థీరీ ఆఫ్ ఎవ్రీ థింగ్)
ఈ కథ వినగానే శారీరకంగా, మానసికంగా నా పాత్రలో ఒదిగిపోవాలనుకున్నా. దాని ఫలితమే ఈ ఆస్కార్. వేదికపై నటి కేట్ బ్లాంచెట్ నోటి నుంచి నా పేరు వినగానే, అడుగులు తడబడ్డాయి. ఆ తడబాటుని కప్పి పుచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈ బంగారు బొమ్మను అందుకోవడం అనేది ఓ అద్భుతమైన కలలా ఉంది. ఇప్పట్లో ఈ కల నుంచి మేలుకోలేను. మేలుకున్న తర్వాత ఇది కల కాదు.. నిజమే అని నమ్ముతాను.
కొన్ని భయాలు విజయాలను ఆస్వాదించనివ్వవు - ఉత్తమ దర్శకుడు అలెగ్జాండ్రో జి. ఇనారిట్ (బర్డ్ మ్యాన్)
అసలీ చిత్రాన్ని ఎందుకు తీశానో? ఎలా తీశానో? బంగారంలాంటి ఈ అవకాశం ఎందుకొచ్చిందో నేను చెప్పలేను. కొన్ని భయాలు.. విజయాలను ఆస్వాదించనివ్వవు. ప్రస్తుతం నేనా పరిస్థితిలో ఉన్నాను. కానీ, సినిమా చేసేటప్పుడు భయపడలేదు. అందుకే ఈ విజయం. అయినా ఆనందపడటంలేదు. నా జీవితంలో నేనెవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే అది మా అమ్మగారికే. నా జీవిత ప్రయాణం ఇందాకా రావడానికి కారణం ఆవిడే.
స్త్రీని ప్రేమించే ప్రతి మగాడూ మా కోసం పోరాడాలి! - ఉత్తమ సహాయ నటి ప్యాట్రీషియా ఆర్క్వెట్టె (బాయ్‌హుడ్)
నామినేషన్ పొందుతాననీ, అవార్డు కూడా సాధిస్తానని నేనూహించలేదు. ఈ సందర్భంగా నేను స్త్రీలకు సమాన హక్కుల గురించి మాట్లాడదల్చుకున్నాను. ఇతర దేశాల్లో పురుషులతో సమానంగా స్త్రీకి అన్ని హక్కులూ ఉండవని మాట్లాడుకుంటాం. కానీ, అమెరికాలో కూడా ఆ పరిస్థితే ఉంది. స్త్రీని ప్రేమించే ప్రతి మగవాడూ, స్త్రీలు, పన్ను కడుతున్న ప్రతి ఒక్కరూ... స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నటులకు ఇస్తున్నంత పారితోషికం నటీమణులకు కూడా ఇవ్వాలి. వయసు పైబడే కొద్దీ నటీమణుల పారితోషికం చాలా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
ఆనందం అంబరమైతే...
Published Mon, Feb 23 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement