
హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు.
ఓటీటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్
జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్‌కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు.
ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్ ఇదే
1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.
చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: హర్షవర్ధన్