Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.