తెలుగువారి ఛాతి రెండంగుళాలు పెరిగింది! | July 3 SV Ranga Rao Centennial sakshi special story | Sakshi
Sakshi News home page

యశస్వీ రంగారావు

Published Sun, Jul 1 2018 12:50 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

July 3 SV Ranga Rao Centennial sakshi special story - Sakshi

ఎస్వీ రంగారావు

ఈతడు లేకపోతే తోటరామునికి రాకుమారి దక్కేదే కాదు. ఈతడు లేని పక్షంలో ప్రహ్లాదునికి హరిదర్శనం అయ్యేదే కాదు. ఇతను లేకపోతే ‘మిస్సమ్మ’కు ‘ఎం.టి.రావు’తో పెళ్లగునా ఏమి? గుండమ్మ ఇతని వల్లనే
లెంపలు వేసుకున్నది. ఇతని వల్లే గదా తాతను నిర్లక్ష్యం చేసిన తండ్రికి మనవడు బుద్ధి చెప్పగలిగినది. స్వయంప్రకాశం కలిగిన హీరోలు చాలా మంది ఉండొచ్చు. కాని స్వయంప్రకాశం కలిగిన కేరెక్టర్‌ ఆర్టిస్టు ఇతడే. తెలుగువారి ఛాతి ఇతడి వల్ల రెండంగుళాలు పెరిగింది.. అప్పుటికి... ఇప్పటికి... ఈ వందేళ్లకు... మరో వందేళ్లకు కూడా. ఎస్‌.వి.ఆర్‌కు కైమోడ్పుల వీరతాడు.

తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు. ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. మరి ఎస్‌.వి.ఆర్‌? గుండెకాయ. ‘నీవేనా నను పిలిచినది... నీవేనా నను కొలిచినది’.... ప్రియదర్శినిలో కనిపిస్తున్న సావిత్రిని చూస్తూ కళ్లు ఎగరేస్తూ అక్కినేని పాడుతున్నాడు. ప్రేక్షకులు మైమరిచి చూస్తున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’.... వెన్నెల సరోవరంలో సంధ్యను తోడు తీసుకుని రెల్లు పొదల మీదుగా ఎన్‌.టి.ఆర్‌ నౌకా విహారానికి బయలుదేరాడు. ప్రేక్షకులు ముచ్చటపడి చూస్తున్నారు. ఈ ముచ్చట... ఈ మైమరుపు... సరే. సినిమాకు ఇవి కావాల్సిందే. కాని  చాలవు. ఏం కావాలి? అదిగో అటు చూడండి. మహాఘటం మోగుతోంది. ఘణఘణఘణ మూర్ఛనలు పోతోంది. అసుర గణాలు మెడలోని ఎముకలు పైవస్త్రాలు సర్దుకుంటూ అదుపాజ్ఞలలోకి వచ్చి వినయంగా వరుసదీరి నిలుచుంటున్నాయి.

‘ఘటోత్కచ.. ఘటోత్కచ... ఘటోత్కచ’... ప్రేక్షకులు తుళ్లిపడ్డారు. విశ్రాంతిగా ఉంచిన చేతులను దగ్గరకు చేర్చి పెద్దగా చప్పట్లు కొట్టారు. నిటారుగా కూర్చున్నారు. బొటన వేలు చూపుడు వేలు కలిపి నోటిలోని గాలిని ఈలగా మార్చారు. ఎస్‌.వి.రంగారావు ప్రత్యక్షమయ్యాడు. సినిమాకు ఈ ఊపు కావాల్సింది. అప్పటికే జనం దగ్గర  వీరతాళ్లు ఉన్నాయి. అక్కినేనికి, ఎన్‌టిఆర్‌కు వేయగలిగినన్ని వేసి మిగిలినవన్నీ ఎస్‌.వి.రంగారావు మెడలో వేశారు. హైహై నాయకా. హోయ్‌ హోయ్‌ నాయకా. ‘మాయాబజార్‌’లో హీరో ఎవరు అనేది నేటికీ పెద్ద పజిల్‌. ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్, సావిత్రి... కాని ప్రధానవాటా ఎస్‌.వి.ఆర్‌ పట్టుకుపోయాడని అభిమానులు చెప్పుకుంటారు. ‘అయ్యారె అప్పళాలు.. పులిహోర దప్పళాలు’... తేన్పులు వచ్చేవరకు రకరకాల పాత్రలతో ప్రేక్షకుల ఉదరాన్ని నింపిన మహావంటగాడు ఎస్‌.వి.ఆర్‌. దేశభాషలందు తెలుగు లెస్సే. కాని దేశ నటులలో ఎస్‌.వి.ఆర్‌ లెస్స.


‘నర్తనశాల’లో ఎన్‌.టి.ఆర్‌ హీరో. అంత పెద్ద వీరుడు– అర్జునుడు– మారువేషంలో బృహన్నలలా మారి విరాట్‌ రాజు కొలువులో తల దాచుకుని ఉన్నాడు. ధర్మరాజుగా మిక్కిలినేని చేతగాని పెద్దమనిషి. భీముడు గాడిపొయ్యి దగ్గర కండలు కరిగిస్తున్నాడు. వీళ్లు వీరులు. పరాక్రమవంతులు. వీళ్ల గొప్పతనం చూడటానికే ప్రేక్షకులు సినిమాకు వచ్చారు. కాని ఏం చేస్తాం? అందులో గెస్ట్‌రోల్‌ లాంటిది ఉంది. కొంచెం సేపు కలకలం సృష్టించే పాత్ర ఉంది. అది వేరెవరో వేస్తే ఎలా ఉండేదో. ఎస్‌.వి.ఆర్‌ వేశాడు. విరాట్‌రాజు కొలువులో చెప్పాపెట్టని తుఫానులా అడుగుపెట్టాడు. పాట పాడుతున్న పాంచాలిని, అదే సైరంధ్రిని, అదే సావిత్రిని చూసి, మనసుపడి ‘ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి’ అన్నాడు. చూడండి వింత. దీనికి కొంతకాలం ముందే ఇదే సావిత్రిని ‘మిస్సమ్మ’లో ఇదే ఎస్‌.వి.ఆర్‌ కన్నకూతురిలా చూస్తూ ‘అమ్మి’.. ‘అమ్మి’ అని అనురాగంగా పిలుస్తూ ఉంటే తండ్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు జనం.

అదే ఎస్‌.వి.ఆర్‌ క్షణాల్లో మారి అదే సావిత్రిపై వక్రదృష్టి పెట్టి సొంతం చేసుకోవడానికి ఆత్రపడుతూ రాక్షసుడిలా మారుతుంటే ‘అమ్మో... కీచకుడంటే ఇలా ఉంటాడా’ అనుకున్నారు జనం. ‘నా గర్వము సర్వము ఖర్వము అయినది’ అని అంతెత్తు మనిషి సావిత్రి ముందు మోకరిల్లడం చూస్తే కోపానికి బదులు జాలి కలిగితే  ఆ దోషం ప్రేక్షకులది కాదు పాత్రది కాదు... దానిని వేసిన ఎస్‌.వి.ఆర్‌ది. ‘ఆరో భర్తగా నన్ను కూడా కట్టుకో. తప్పులేదులే’ సావిత్రిని వేధించిన ఎస్‌.వి.ఆర్‌ కామంతో పాటు వెర్రి వ్యామోహం కూడా ప్రదర్శిస్తాడు. చివరకు అతి బలాఢ్యుడైన భీమసేనుడి చేతిలో ఊపిరి కోల్పోతాడు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. 1964లో ‘జకార్తా’లో ‘ఆఫ్రో–ఆసియా ఫిలిమ్‌ ఫెస్టివల్‌’ జరిగి అందులో 24 దేశాలు పోటీ పడితే అందులో ‘నర్తనశాల’ కూడా పాల్గొంటే అవార్డు కమిటీ ఆ సినిమాతో పాటు అన్ని సినిమాలను జల్లెడ పట్టింది. ఈ 24 దేశాల నుంచి ఉత్తమ నటుడుగా ఎవరిని ప్రకటించాలి? వేదిక మీద పేరు పిలిచారు. సామర్లకోట వెంకట రంగారావు. ఒక తెలుగువాడికి అంతర్జాతీయంగా మొదటిసారి చప్పట్లు వినిపించిన సందర్భం అది.


జూదంలో ఓడిపోయాక తల వొంచుకుని నిలబడాలి. భార్యను కూడా పణంగా పెట్టాక పౌరుషాలు కట్టిపెటాలి. కౌరవుల కొలవులో పాండవులు కట్టుబట్టలతో మిగిలారు. అయినా కసి చాలని దుర్యోధనుడు ద్రౌపదిని, ఏకవస్త్రను, భర్తల నిర్వాకాన్ని విని స్థాణువైన సాధ్వీమణిని నిండు సభకు దుశ్శాసనునిచే ఈడ్చుకొచ్చేలా చేసి పాండవులను పరాభవించడానికి ఆమెను తన తొడ మీద కూర్చోమన్నట్టుగా సైగ చేస్తే భర్తగా ఉన్న భీమసేనునికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం సహజం. ‘ఒరే దుర్యోధన’... అని ఆ పాత్ర ధరించిన ఎన్‌.టి.ఆర్‌  పళ్లు పటపటకొరుకుతుంటే థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా కోపంతో మండిపోవాలి. కాని అలా జరగలేదు. దుర్యోధనుడైన ఎస్‌.వి.ఆర్‌ అంతటి ఆగ్రహాన్ని లెక్క లేనట్టుగా పూచికపుల్లలా తీసి అవతల పారేసి ‘బానిసలు... బానిసలకు ఇంతటి అహంభావమా’ దర్పం ప్రదర్శిస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. పాత్ర ఓడిపోయి నటుడు గెలిచిన సందర్భం అది. తెలుగువారికే సొంతమైన ముచ్చట. ‘పాండవవనవాసం’లో ఎస్‌.వి.ఆర్‌ కలిగించిన ఆనందం.

మనిషితో వైరానికి మరో మనిషి చాలు. కాని శ్రీహరితో వైరానికి మహా రాక్షసుడు కావాలి. అంతెత్తు మనిషి. విశాలమైన కళ్లు. ఖంగున మోగే కంఠం. మీసాలు కూడా ప్రదర్శించగల పౌరుషం... ఆ విగ్రహం కలిగినవాడు కనుకనే  ఎస్‌.వి.ఆర్‌ హిరణ్యకశిపుడు అయ్యాడు. భస్మాసురుడు అయ్యాడు. కంసుడు అయ్యాడు. రావణాసురుడు అయ్యాడు. ‘ఏడీ చూపించు నీ హరిని’ అంటూ ‘భక్త ప్రహ్లాద’లో ఎస్‌.వి.ఆర్‌ స్తంభం వైపు చూపితే స్తంభాన్ని పెకలించుకుని నృసింహుడు ప్రత్యక్షమైతే  హరితో అతడు తాడోపేడో తేల్చుకుంటాడేమో అని భయం వేస్తుంది. అది అక్కడ కనిపించిన రాక్షస వీరత్వం. అంతటి  రాక్షస పాత్రలలో ఎస్‌.వి.ఆర్‌ను చూసినా కూడా ప్రేక్షకులకు కలిగేది ద్వేషం కాదు భక్తే.

సి.హెచ్‌.నారాయణరావు తెలుగు వెండి తెరకు తొలి అందాల నటుడు. కాని ఆయన ప్రభ ఎన్‌.టి.ఆర్‌ రావడంతోనే కనుమరుగు అయ్యింది. అలాగే తెలుగు తెర మీద ఎందరో ప్రతిభావంతమైన కేరెక్టర్‌ ఆర్టిస్టులు గోవిందరాజుల సుబ్బారావు, ముదిగొండ లింగమూర్తి, ముక్కమల, సిఎస్‌ఆర్, నాగయ్య... వీరందరినీ దాటేసి ముందుకు వచ్చినవాడు ఎస్‌.వి.ఆర్‌. ‘దొంగరాముడు’ నాటికి తెలుగువారి స్టార్‌ విలన్‌గా ఉన్న ఆర్‌.నాగేశ్వరరావు ఎస్‌.వి.ఆర్‌ ప్రతాపానికి ‘మాయాబజార్‌’లో ‘మరి మన తక్షణ కర్తవ్యం’ అనుకుంటూ ఉండే కర్ణుడి పాత్రలో లుప్తమవడం కచ్చితంగా గమనించి తీరాలి. రంగారావు మింగేస్తాడు. అది ఆయన బలం. రంగారావు నమిలేస్తాడు. అందుకే సాటి ఆర్టిస్టులకు జంకు.


‘షావుకారు’లో సున్నపు రంగడు, ‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడు, ‘బంగారుపాప’లో కోటయ్య, ‘సంతానం’లో గుడ్డి రంగయ్య, ‘పెళ్లి చేసి చూడు’లో ‘వియ్యన్న’... ఈ పాత్రలన్నీ ఎస్‌.వి.రంగారావును తిరుగులేని కేరెక్టర్‌ ఆర్టిస్టుగా నిలబెట్టాయి. అప్పటికి ‘బాడీ లాంగ్వేజ్‌’ అనే మాట తెలియదు. కాని ఆ బాడీ లాంగ్వేజ్‌తోనే తాను కావలసిన పాత్రలా మారిపోతున్నాని ఎస్‌.వి.ఆర్‌కు తెలుసు. అందుకే ఆయన మంచివాడు, క్రూరుడు, ఇంటి పెద్ద, సంఘంలో మర్యాదస్తుడు. అందుకే ఆయన తెలుగుతో పాటు తమిళంలలో కూడా ఖ్యాతి గడించాడు. శివాజీ గణేశన్‌ ఆయనకు ఆప్తమిత్రడు. ఈ రెండు పులులు కలిసి తపాకీ పట్టుకుని అడవిలో మరో పులిని వేటాడిన ఉదంతం ఆ కాలానికి మిగిలిన ఒక అపురూపమైన ముచ్చట. ఎస్‌.వి.ఆర్‌ సీను ఎంతగా కబళించేవారంటే ఆయనతో కలిసి శివాజీ నటించాల్సి వస్తే  ‘ఈ సీను నాకు వదిలిపెట్రా’ అని ఎస్‌.వి.ఆర్‌ని బతిమిలాడేవారట. ప్రతి ఆర్టిస్టుకు స్క్రీన్‌ మీద తానేమిటో చూపించాలని అహం ఉంటుంది. అందుకే ఎస్‌.వి.ఆర్‌ రిహార్సల్‌లో ఒకలాగా టేక్‌లో మరోలాగా చేసేవారట. రిహార్సల్స్‌లో ఆయన చేసిన పద్ధతికి ఫిక్స్‌ అయిన సహ నటీనటులు టేక్‌లో ఆయన చప్పున ధోరణి మార్చేసరికి ఖంగు తిని తెల్లబోవడం ఆనవాయితీగా ఉండేది. సావిత్రి కూడా ‘కన్‌ఫ్యూజ్‌ చేయకు బావా’ అని ముద్దుగా విసుక్కునేదని సినీ ముచ్చట.


ఎంతటి గొప్ప నటుడైనా హాస్యం చేయకపోతే పరిపూర్ణమైన నటుడుగా గణింపబడడు. గొప్పనటులంతా మంచి హాస్యం చేసినవారే. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, ‘గుండమ్మ కథ’, ‘మంచి మనసులు’, ‘తోడి కోడళ్లు’... ఈ సినిమాలన్నింటా ఎస్‌.వి.ఆర్‌ సున్నితమైన హాస్యాన్ని చూపించారు. నేపాళ మాంత్రికుడిగా భయపెట్టిన వ్యక్తి సూర్యకాంతం మొగుడిగా చేతులు నలుముకుంటూ నిలబడి మెప్పించడం వింతే కదా. ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘వెలుగునీడలు’, ‘దసరాబుల్లోడు’.... ‘మాట్లాడరేమండీ’ అని సూర్యకాంతం అంటే ‘నిన్ను కట్టుకున్నాక ఎప్పుడు మాట్లాడాను కనుక’ అని ఎస్‌.వి.ఆర్‌ టైమింగ్‌తో అనడం తెలుగువారికి మాత్రమే సొంతమైన నటనా వినోదం.


ఏడ్చే మగవాళ్లు బాగుండరని అంటారు. కాని ఎస్‌.వి.రంగారావు ఏడిస్తే మనకు ఏడ్పు వచ్చేది. ‘హరిశ్చంద్ర’, ‘ఆత్మబంధువు’, ‘లక్ష్మీ నివాసం’, ‘సుఖదుఃఖాలు’, ‘సంబరాల రాంబాబు’, ‘దసరాబుల్లోడు’... ఇవన్నీ ఆయన ప్రదర్శించిన కరుణ రసంతో కన్నీరు పెట్టించాయి. ‘పండండి కాపురం’లో ఆయన వంటి పెదనాన్నను పోల్చుకుని ప్రేక్షకులు ఉండరు. ‘తాత–మనవడు’లో అటువంటి తాతను చూసి శోకించని మనుమలూ ఉండరు. ‘బాబూ... వినరా... అన్నాదమ్ములా కథ ఒకటి’... ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’.... రేడియోల్లో నేటికీ మోగే ఈ గీతాలు ఎస్‌.వి.ఆర్‌. వేసిన భిక్ష.


ఎస్‌విఆర్‌ తుపాకీ పట్టాల్సిన రోజులు వస్తే తుపాకి పట్టారు. ‘జగత్‌ జెట్టీలు’, ‘జెగత్‌ జెంత్రీలు’, ‘జెగత్‌ కిలాడీలు’... వీటితో పాటు ‘కత్తుల రత్తయ్య’, ‘దెబ్బకు ఠా దొంగల ముఠా’ వీటిలో మాస్‌గా నటించి మాస్‌ ప్రేక్షకులకు అలరించారు. ‘నా పేరు తెలుసుగా కత్తుల రత్తయ్య. పచ్చి నెత్తరు తాగుతా’ అని ఆయన చెప్పే డైలాగులు ఆ రోజుల్లో తొలి పంచ్‌ డైలాగులు. ‘డోంగ్రే’, ‘గూట్లే’, ‘జింగిడి’ ఇవన్నీ ఆయన పాపులర్‌ చేసిన తిట్లు. ‘ఏంటి బే’ అనేది అనగలిగేది వెండితెర మీద మొదటిసారిగా ఎస్‌.వి. రంగారావే. కాని ఎన్నిచేసినా ఎన్ని పాత్రలకు ముఖాన రంగు పూసుకున్నా అవన్నీ ఏనుగుకు వెలగపండులా ఆయన నట జఠరాగ్నికి ఆవిరి అయిపోయేవి. ‘ఈ దేశం నాకు చాలదు’ అనుకునేవాడాయన. ‘హాలీవుడ్‌లో నటించాలి... ఆస్కార్‌ సాధించాలి’ అని కూడా అనుకునేవాడు. కాని లక్షలాది ప్రేక్షకుల హృదయాలలో పర్మినెంట్‌ ట్రోఫీ తప్ప ఆయనకు వేరే ఏ ట్రోఫీ అందలేదు. ‘పద్మశ్రీ’ ఇస్తారటగా గొప్పవారికి. ఎస్‌.వి.రంగారావు ‘పద్మశ్రీ’ లేని పదింతల గొప్పవాడు.

ఎస్‌.వి.ఆర్‌ దూకుడు తగ్గించడానికి ఇండస్ట్రీలో ఒకరిద్దరు పెద్దలు గుమ్మడి గారిని ప్రోత్సహించారన్నది వాస్తవం. కాని గుమ్మడిగారికి తన పరిమితులు తెలుసు. తను కేవలం గుమ్మడే. కాని ఎస్‌.వి.ఆర్‌? అశోక్‌ కుమార్‌లోని ఉదాత్తత, ప్రాణ్‌లో చతురత, ఓంప్రకాశ్‌లోని సౌమ్యం, ప్రేమ్‌నాథ్‌లోని ధిక్కారం కలగలిసిన నటుడు. అని గుమ్మడిగారే చెప్పేవారు. చెప్పి నమస్కరించేవారు. ఒకరిని కోల్పోయాక ఆ స్థానంలో మరొకరిని ప్రతిష్టించడం కష్టం. ఎస్‌.వి.ఆర్‌ వారసుడిగా తెలుగు ప్రేక్షకులు కొద్దో గొప్పో అంగీకరించగలిగినది కైకాల సత్యనారాయణనే. ఆ వరుసలో రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌ రాజ్‌ వంటి ప్రతిభావంతమైన నటులను కూడా చూస్తున్నాం. రోజులు గడిచిపోయి ఉండవచ్చు. కాలం మారిపోయి ఉండవచ్చు. కాని ఒక సింహం గర్జించింది అన్న జ్ఞాపకం చెరిగిపోలేదు. ఇవాళ ఆ మహానటుడి శత జయంతి.
ఆయన వదిలి వెళ్లిన పరంపరను చేతులు అడ్డుపెట్టుకుని కాపాడుకుంటామనే ఒప్పుదల చేస్తూ....

ఫైర్‌ ఆఫీసర్‌ నుండి ఫైర్‌ ఉన్న నటుడిగా...
ఎస్‌.వి.రంగారావు స్వస్థలం కృష్ణా జిల్లా నూజివీడు. 1918 జూలై 3న జన్మించారు. కలిగిన కుటుంబం. తాత సర్జన్‌. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మద్రాసులో నానమ్మ దగ్గర ఉంటూ అక్కడే హైస్కూలు చదువు చదివారు. ఆంధ్రా తిరిగి వచ్చి డిగ్రీ పూర్తి చేశారు. ఫైర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. మూడు నెలలకు మించి చేయలేకపోయారు. దగ్గర బంధువు తీసిన ‘వరూధిని’ (1947)లో మొదటిసారి హీరోగా నటించారు. అది ఫ్లాప్‌ అయింది. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుని మూడేళ్లు జంషడ్‌పూర్‌ వెళ్లిపోయారు. తిరిగి ‘పల్లెటూరి పిల్ల’తో రంగప్రవేశం చేశారు. ఈలోపే మేనమామ కుమార్తె లీలావతితో వివాహమయ్యింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ గట్టి పట్టు పట్టడంతో ‘షావుకారు’లో రౌడీ పాత్ర లభించింది. ఆ తర్వాత ‘పాతాళభైరవి’లోని నేపాళ మాంత్రికుడు పాత్రతో స్టార్‌డమ్‌ వచ్చింది. 1973లో ఆయనకు హైదరాబాదులో బైపాస్‌ సర్జరీ జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పినా షూటింగ్‌లో పాల్గొన్నారు. 1974 జూలై 18 మధ్యాహ్నం మూడు గంటల వేళ తిరిగి హార్ట్‌ ఎటాక్‌ రావడంతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు కోటేశ్వరరావు కూడా చిన్న వయసులోనే హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు. కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. ఎస్‌.వి. రంగారావు మనవడు జూనియర్‌ ఎస్వీఆర్‌ సినిమా హీరోగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.


ముక్కు మీద కోపం
ఎస్‌.వి.రంగారావులో రకరకాల మూడ్స్‌ ఉండేవని అంటారు. ఒక్కోసారి ఆయన షూటింగ్‌ మానేసి వారం పది రోజుల పాటు తన ఫామ్‌ హౌస్‌కు పరిమితమయ్యేవారట. షూటింగ్‌ మధ్యలో కూడా మూడ్‌ పాడైతే వెళ్లిపోయేవారట. ఆయనకు మంచి మూడ్‌ లేకపోతే చిన్న సీన్‌ కూడా ఎక్కువ టైమ్‌ పట్టేది. హుషారుగా ఉంటే చాలా పెద్ద సీన్‌ను కూడా లంచ్‌ టైమ్‌కే క్లోజ్‌ చేసేసేవారట. ఆయన హాస్య ప్రియుడు. ఛలోక్తులు విసరడం, సరదాగా ఉండటం ఇష్టపడేవారు. సాటి ఆర్టిస్టులు ఆయన మూడ్స్‌ను గమనించుకుని మసలేవారు. జమున, వాణిశ్రీ వంటి హీరోయిన్లు ఆయనను డాడీ అని పిలిచేవారు. ఎస్‌.వి.ఆర్‌.కు రేలంగి అంటే ఇష్టం. ఆయనతో బాగా చనువుగా ఉండేవారు. ఇంటికి రాకపోకలు సాగించిన నటులలో అల్లు రామలింగయ్య ఒకరు. సావిత్రి ఇల్లు, ఎస్‌.వి.ఆర్‌. ఇల్లు ఎదురుబొదురుగా ఉండేవి. ఎస్‌.వి.ఆర్‌.కు కుక్కలన్నా, పక్షులన్నా ఇష్టం. తన నివాసంలోని సర్వెంట్‌ క్వార్టర్స్‌ దగ్గర దాదాపు 2 బెడ్‌ రూమ్‌ హౌస్‌ అంత షెడ్‌ కట్టి పక్షులను, బాతులను పెంచేవారు. ఆయన దగ్గర ఉన్న జర్మన్‌ షపర్డ్‌ కుక్కలలో ఒకటి ఆయన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆయన చనిపోయిన కొద్ది రోజులకే తానూ ప్రాణం విడిచింది.


భోజన ప్రియుడు
ఎస్‌.వి.రంగారావు భోజన ప్రియుడు. మాంసాహారాన్ని బాగా ఇష్టపడేవారు. తను లొకేషన్‌లో ఉంటే మూడు నాలుగు హోటళ్ల నుంచి నాన్‌వెజ్‌ తెప్పించి సహ నటులకు వడ్డించేవారు. తినండి తినండి.. మీరు అడిగితే ప్రొడ్యూసరు ఇవన్నీ తెప్పించడు అని అనేవారు. ఈ భోజన ప్రియత్వమే ఆయనకు స్థూలకాయం తెచ్చిపెట్టింది. మద్యపాన ప్రియత్వం కూడా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు. స్మోకింగ్‌ కోసం రకరకాల లైటర్స్‌ని సేకరించేవారు.



                                      గుండమ్మ కథ


                              నర్తనశాల


         కుమార్తెలు, కుమారుడుతో ఎస్‌.వి.ఆర్‌. దంపతులు (చిన్నపిల్లాడు ఎస్‌.వి.ఆర్‌. మేనల్లుడు)





– కె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement