ప్రస్తుతం హాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో టాపిక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచినవాటిలో ‘జురాసిక్ వరల్డ్ 3’ ఒకటి. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి చిత్రం ‘జురాసిక్’ (1993)లో వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లలూ పెద్దలూ ఫిదా అయిపోయారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ఈ ‘జురాసిక్ పార్క్’ ఎంత క్రేజ్ తెచ్చుకుందంటే.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్‌ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ 3’పైనే అందరి దృష్టి ఉంది. కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్ అదిరిపోయే రేంజ్‌లో ఉందని కీలక పాత్రధారి క్రిస్ ప్రాట్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది విడుదలై, ఘనవిజయం సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కి దీటుగా తాజా జురాసిక్ చిత్రం ఉంటుంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాలకన్నా ఈ చిత్రకథ మరింత కిక్ ఇచ్చే విధంగా ఉంది. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. భారీ స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు క్రిస్ ప్రాట్. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment