భారత్‌లో పాప్ సంచలనం ప్రదర్శనలు
ముంబై: తన పాటలతో పాప్ ప్రపంచాన్ని మైమరపించే కెనడా పాప్ సంచలనం జస్టిన్ బీబర్ తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేశాడు. మంగళవారం అర్ధారత్రి ముంబైకి వచ్చిన బీబర్‌ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఐదు రోజులపాటు భారత్‌లో గడపనున్న బీబర్.. ముంబైతోపాటు ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను సందర్శించనున్నాడు. నేడు ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. బాహుబలి సమర్పకుడు, బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోలో బీబర్ పాల్గొనున్నాడు.
బుధవారం ఈ పాప్ సంచలనం కరణ్ షో కోసం షూటింగ్‌లో పాల్గొంటాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. కరణ్ రెగ్యూలర్‌గా బాలీవుడ్ ప్రముఖులను తన షోలో ఇంటర్వ్యూ చేసేవారు. అయితే తొలిసారిగా ఓ అంతర్జాతీయ సెలబ్రిటీని కరణ్ ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రైవేట్ విమానంలో ముంబైకి చేరుకున్న బీబర్ 120 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. అంతర్జాతీయ సెలబ్రిటీ కావడంతో షో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో బీబర్ కోసం ప్రత్యేక సూట్లను సిద్ధం చేశారు. సల్మాన్‌ఖాన్ బాడీగార్డు మూడు రోజుల పాటు బీబర్ వద్ద విధులు నిర్వహించనున్న విషయం తెలిసిందే.