మరో మంకీపై ముచ్చటపడుతున్న సింగర్
లాస్‌ఏంజిల్స్: గ్రామీ అవార్డు విన్నర్, యువ పాప్ సంచలనం జస్టీన్ బీబర్‌వన్నీ విచిత్రమైన కోరికలు. 'సారీ' హిట్‌మేకర్ ఇప్పటికే ఓ కోతిని పెంచుకున్నాడు. కాపుచిన్ జాతికి చెందిన కోతికి 'ఓజీ మ్యాలీ' అని పేరు పెట్టి.. ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడు. అలా 2013 మార్చిలో జర్మనీకి 'మ్యాలీ'తో కలిసి వెళ్తుండగా.. అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఆ కోతిని అతడి నుంచి వేరుచేసి జూకు తరలించారు. అప్పటినుంచి పెట్ లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్న ఈ 21 ఏళ్ల సింగర్ తాజాగా మరో కోతిని పెంచుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అతని ప్రకటనపై జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కోతిని పెంచుకోవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచిస్తున్నాయి. కోతిని అతడు సరిగ్గా సంరక్షించలేడని, అందుకు బదులు ఏదైనా పెంపుడు జంతువును అతడు ఎంచుకోవచ్చునని చెప్తున్నాయి.
'మరోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. నీ ప్రైవేటు నివాసంలో కోతిని పెంచుతూ దాని అవసరాల్నీ తీర్చడం అంతగా సాధ్యం కాదు. ఇది కోతికి, నీకు ప్రమాదకరం. నీ అభిమానులను కూడా ఇబ్బందిపెట్టే అంశం.' అని నార్త్ అమెరికా ప్రిమేట్ సాంచ్యురీ అలయెన్స్ (ఎన్ఏపీఎస్‌ఏ) ఓ ప్రకటనలో బీబర్‌కు సలహా ఇచ్చింది. బీబర్ మాత్రం తన ఓజీ మ్యాలీ దూరమవ్వడంపై బాధ వ్యక్తంచేస్తూ.. మళ్లీ దానిని ఎలాగైన తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. లేకపోతే మరో కోతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానని చెప్తున్నాడు.