'ధ్రువతార రాలిపోయింది'
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్ మరణంతో ధ్రువతార రాలిపోయిందని కళాతపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. ఆయన మరణం గ్రేటెస్ట్ షాక్ అని వ్యాఖ్యానించారు. తమలాంటి వారందరికీ ఆయన టెక్ట్ బుక్ లాంటి వారని పేర్కొన్నారు. ఆయన దగ్గర వారం రోజులు పనిచేస్తానని బాలచందర్ ను అడిగానని వెల్లడించారు.
ఆయన దగ్గర పనిచేసే అవకాశం రాకపోయినా తెర పంచుకునే భాగ్యం దక్కిందన్నారు. ఉత్తమ్ విలన్ సినిమాలో ఆయనతో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే కుతూహలం, ఎవరిచేతైనా నటింపచేయగల సామర్థ్యం ఆయన సొంతమన్నారు. అనారోగ్యం బారిన పడిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారని అనుకున్నామని, కానీ ఇంతలోనే ఆయన వెళ్లిపోయారని విశ్వనాథ్ వాపోయారు.