బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న కబాలి
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్సాఫీస్ రికార్డ్ల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సంచలనాలను నమోదు చేసిన తలైవా, రిలీజ్ తరువాత కూడా తన హవా కోనసాగిస్తున్నాడు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాకు థియేటర్లు లభించటంతో కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధ్యమవుతున్నాయి.
తమిళనాట 650కి పైగా స్క్రీన్లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయిన కబాలి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కబాలి హవా దక్షిణాదిని ఊపేయనుంది. రజనీకి భారీ క్రేజ్ ఉన్న తెలుగు, తమిళ్లోనే కాదు, కేరళలో కూడా కబాలి భారీగా రిలీజ్ అయ్యింది. దాదాపు 306 థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది.
కబాలి సంచలనాలు దక్షిణాదికే పరిమితమైపోలేదు. ఉత్తరాదిలో కూడా తలైవా హవా చూపిస్తున్నాడు. కేవలం ఈ సినిమా చూడటానికే విదేశీయులు ముంబై చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కలిపి 135 థియేటర్లలో కబాలి సందడి కనిపిస్తుండగా, పంజాబ్లో 70 థియేటర్లలో కబాలి రిలీజ్ అయ్యింది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కబాలి మేనియా బాగా కనిపిస్తోంది.
ఇప్పటికే తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన తలైవా.. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతో బాహుబలి, భజరంగీబాయిజాన్ లాంటి భారీ రికార్డ్లకు డోకా లేదన్న వాదన వినిపిస్తోంది.