
అంతా ఉత్తిదే.. కబాలి లీక్ అవ్వలేదు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా లీక్ అయ్యిందంటూ వస్తున్న వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా కబాలి సినిమా ఆన్లైన్లో లీక్ అయ్యిందంటూ వార్తలు వస్తుండటంపై స్పందించిన చిత్రయూనిట్, అలాందేమి లేదంటూ తేల్చేసింది. ఇటీవల బాలీవుడ్ సినిమాలు ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీలు రిలీజ్కు ముందే లీక్ అవ్వటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు.
రజనీ కబాలి విషయంలో ఇప్పటికే భారీగా బిజినెస్ జరగటంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 250కి పైగా వెబ్సైట్ల మీద నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పైరసీ వెబ్సైట్లపై చర్యలు తీసుకున్న చెన్నై పోలీసులు, పైరసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.
అయితే వారం రోజులుగా కబాలి లీక్ పై ప్రచారం జరుగుతున్నా.. చిత్రయూనిట్ ఇంత ఆలస్యంగా స్పందించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమోషన్ కోసం ఇలాంటి రూమర్స్ ను ప్రోత్సహించారన్న వాదన వినిపిస్తోంది.