
లుక్స్ ఓకే!
‘లీడర్’ నుంచి మొన్నామధ్య విడుదలైన తమిళ చిత్రం ‘బెంగళూరు నాట్కళ్’ వరకూ రానా కెరీర్‌ని పరిశీలిస్తే, వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న విషయం తెలుస్తుంది. ఇప్పటివరకూ రానా చేసిన చిత్రాల్లో ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ అస్సలు పోలిక ఉండదు. ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘ఘాజి’ చిత్రాలతో పాటు తమిళ చిత్రం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా మరో చిత్రం అంగీకరించారు. తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రానా. ఇది నిజంగా ఎవరూ ఊహించని కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఓ విశేషం అయితే, తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో రానా సరసన కథానాయికగా నటించనుండటం మరో విశేషం.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలో ఆమె చేయనున్న చిత్రం ఇది. రానా, కాజల్ పాల్గొనగా లుక్ టెస్ట్ కూడా చేశారు. ఈ జోడీ చాలా బాగుందట. లుక్ టెస్ట్ ఓకే కావడంతో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు.