రాధాజోగేంద్ర అందరికీ నచ్చారు
భర్త అంటే భరించే వాడు కాదు... భార్యను ప్రాణంగా చూసుకునేవాడు. తన జీవితంలోనే కాదు తన ఆలోచనల్లో కూడా సగ భాగం ఆమెకు కల్పించి, గౌరవించేవాడు. భార్య ఇష్టాన్నే తన ఇష్టంగా, ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు నిజమైన భర్త. భార్య కూడా అంతే. భర్త తప్పులు చేయకుండా వెన్నంటే ఉండాలి. భర్త ఆశయం కోసం తన వంతు సాయం చేయాలి. ఇలా భార్యాభర్తలు కలిసి మెలిసి ఉంటే ఆ దాంపత్యం ఆనందంగా ఉంటుంది. ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది. కాజల్, రానా జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లోని భార్యాభర్తల (రానా–కాజల్) ప్రేమ చూడముచ్చటగా ఉంటుంది. డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. జోగేంద్ర (రానా), రాధ (కాజల్) మనసుల్లో నిలిచిపోతారని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
కథ..
వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్రకు భార్య రాధే ప్రపంచం. కానీ, ఈ దంపతులకు సంతానం ఉండదు. తీరా దేవుడు దయ వల్ల రాధ కడుపు పండితే అనుకోని పరిస్థితులు ఆ సంతోషాన్ని వారి నుంచి దూరం చేస్తాయి. దీంతో రాధ చాలా బాధపడుతుంది. అప్పటివరకు మంచివాడిలా ఉన్న జోగేంద్ర ఆ ఘటన తర్వాత రూట్ మార్చుతాడు. ఏమైనా చేసి రాధను సంతోషంగా ఉంచాలనుకుంటాడు. ముందుగా ఆ ఊరి సర్పంచ్ అవుతాడు. ఊరి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, మినిస్టర్ వరకు ఎదుగుతాడు జోగేంద్ర.
ఆ తర్వాత సీఎం కావాలనుకుంటాడు? కానీ, శత్రువులు ఆడిన రాజకీయ చందరగంలో తన నమ్మినబంటు శివ (నవదీప్) ను తానే చంపుకుంటాడు జోగేంద్ర. ఇదే సమయంలో జోగేంద్ర తప్పుడు పనులు చేస్తున్నాడని నిరూపించేందుకు జర్నలిస్టు దేవికారాణి (క్యాథరిన్)ట్రై చేస్తుంది. అసలు జోగేంద్ర మారడానికి దారితీసిన పరిస్థితులు ఎంటి? దేవికారాణి ఎంటరైన తర్వాత రాధ, జోగేంద్ర జీవితాల్లో ఎమైనా మార్పులు వచ్చాయా? రాధ కోసం జోగేంద్ర తన దారిని మార్చుకున్నాడా? సి.ఎం. కావాలనుకున్న కలను నేరవేర్చుకున్నాడా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
కథను నమ్మి ఈ సినిమా తీశామని, ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారని నిర్మాతలు డి. సురేశ్‌బాబు, సీహెచ్ భరత్‌చౌదరి, కిరణ్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులకు దగ్గర కావడానికి ముఖ్యం కారణాలు కథ, అందులో ఉన్న ఎమోషన్ అన్నారు.
ఇంకా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జోగేంద్ర, రాధల స్వచ్ఛమైన ప్రేమ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రానా, కాజల్ ఎమోషనల్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు. స్క్రీన్‌పై రానా, కాజల్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఒక పక్క రాధ, జోగేంద్ర లవ్‌స్టోరీని చూపిస్తూనే, మరోపక్క పొలిటికల్ డ్రామాను జోడించి, డైరెక్టర్ తేజ బాగా తీశారు. స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. అనూప్ రూబెన్స్ పాటలు మెప్పిస్తున్నాయి. జోగేంద్ర పాత్రకు రానా జీవం పోశారు. ఎక్స్‌లెంట్‌గా నటించారు. చాలా తక్కువమంది హీరోలు ఇలాంటి కథలను ఎంచుకుని, సినిమాలు చేస్తారు. ఇలాంటి కథ చేయండ హీరో రానా గొప్పతనం. రానా డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందుకు లీడర్, బాహుబలి, ఘాజి తదితర చిత్రాలే నిదర్శనం. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను కంప్లీట్ చేశాం. మంచి కథ–కథనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు’’ అన్నారు.