టైటిల్ : నేనే రాజు నేనే మంత్రి
జానర్ : పొలిటికల్ థ్రిల్లర్
తారాగణం : రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, నవదీప్
సంగీతం : అనూప్ రుబెన్స్
దర్శకత్వం : తేజ
నిర్మాతలు : సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
కెరీర్ లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా, పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ తన స్టైల్ ను పక్కన పెట్టి ఓ డిఫరెంట్ జానర్ లో చేసిన ఈ సినిమా రానా కెరీర్ ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తేజ కూడా ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి నేనే రాజు నేనే మంత్రి రానాకు సోలో హీరోగా సక్సెస్ అందించిందా..? ఈ సినిమాతో తేజ మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడా..?
కథ :
జోగేంద్ర(రానా దగ్గుబాటి)కి తన భార్య రాధ(కాజల్) అంటే ప్రాణం. వడ్డీ వ్యాపారం చేస్తూ బతికే జోగేంద్రకు భార్య, మామ తప్ప మరో ప్రపంచం తెలీదు. తాకట్టు లేకుండా అప్పు ఇవ్వకపోవటం జోగేంద్ర అలవాటు.. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఆదుకోవటం రాధకు అలవాటు. పెళ్లైన మూడేళ్ల తరువాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆనందం వారి జీవితంలో ఎంతో సేపు నిలబడదు. ఊరి సర్పంచ్ భార్యతో జరిగిన గొడవలో రాధ కడుపులో బిడ్డ చనిపోతుంది.
సర్పంచ్ భార్య వల్లే తన భార్యకు ఇలా జరిగిందన్న కోపంతో జోగేంద్ర సర్పంచ్ ను చంపి ఊరి సర్పంచ్ అవుతాడు. తన పెత్తనానికి అడ్డొస్తున్నాడని ఎమ్మెల్యేను చంపి ఎమ్మెల్యే అవుతాడు. మంత్రి బలం ముందు ఎమ్మెల్యే బలం చాలటం లేదన్న కోపంతో మంత్రి కావాలని నిర్ణయించుకుంటాడు. చివరకు ఎలాగైన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ జోగేంద్రకు కలుగుతుంది. ఈ పరుగులో అసలు తాను ఇదంతా ఎందుకు మొదలుపెట్టాడో మర్చిపోతాడు. రాధ ప్రేమను పక్కన పెట్టి ఎలాగైన సీఎం అవ్వటమే లక్ష్యంగా అక్రమాలు చేస్తుంటాడు. రాధ కోసం రాక్షసుడిగా మారిన జోగేంద్రను రాధ ఏం చేసింది..? చివరకు జోగేంద్ర ముఖ్యమంత్రి అయ్యాడా..? లేక రాధ కోరుకున్నట్టుగా మనిషిగా మారాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
విలక్షణమైన జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయాడు. భార్యను ప్రాణంగా ప్రేమించే సాధారణ వడ్డీ వ్యాపారీగా.. తన గెలుపు కోసం ఎంతకైనా తెగించే మూర్ఖపు రాజకీయ నాయకుడిగా రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. సినిమా అంతా హుందాగా చీరలో కనిపిస్తూనే.. అందం అభినయం తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. విలన్ గా అశుతోష్ రాణా, పోసాని కృష్ణమురళీ ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నవదీప్, శివాజీ రాజా, అజయ్, ప్రదీప్ రావత్ లు తన పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణులు :
లాంగ్ గ్యాప్ తరువాత తేజ కొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గతంలో తానే డీల్ చేయని కొత్త తరహా కథను ఎంచుకున్నా.. కథనం మాత్రం తన గత చిత్రాల పంథాలోనే కొనసాగించాడు. బలమైన హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు హీరోనే సినిమా అంతా విలన్ గా నడిపించాడు. తొలి భాగం ఎమోషన్స్, పొలిటికల్ స్ట్రాటజీస్ తో స్పీడుగా నడిపించిన దర్శకుడు ద్వితాయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. యాంటీ క్లైమాక్స్ తో ముగించటం కూడా కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. టైటిల్ సాంగ్ తో అనూప్ ఫుల్ మార్క్స్ సాధించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రానా నటన
మెయిన్ స్టోరి
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
'నేనే రాజు నేనే మంత్రి' మూవీ రివ్యూ
Published Fri, Aug 11 2017 3:26 PM | Last Updated on Mon, Sep 11 2017 11:50 PM
Advertisement
Advertisement