ఎవరూ వెనక్కి వెళ్లలేని పరిస్థితి!
– డి.సురేశ్ బాబు
‘‘సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా, యాక్టర్‌గా రావాలని చాలామంది అనుకుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. తక్కువమంది సక్సెస్ అవుతారు. నాకు మా ఫాదర్ (డి. రామానాయుడు) ఒక కంపెనీ తయారు చేసి పెట్టారు. నా తమ్ముడు (వెంకటేశ్) యాక్టర్. తనతో సినిమాలు తీస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు (రానా) కూడా ఉన్నాడు. ఎక్కడో నేను బ్లెస్డ్ అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. రానా, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డి.సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి.కిరణ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇది రాధ, జోగేంద్ర స్టోరీ. రాధ, జోగేంద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. తర్వాత లవర్స్.. ఆ తర్వాత భార్యాభర్తలు. అనుకోని కారణాల వల్ల రాధకు దూరమవుతాడు జోగేంద్ర. చివరికి రాధ దగ్గరకు వెళ్లి ఫైనల్‌గా ఎలా సెట్ అయ్యాడన్నదే చిత్రకథ. మూడో అమ్మాయి క్యాథరిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ఈ నెల 11న మరో రెండు సినిమాలు విడుదలవుతున్న విషయం గురించి సురేశ్‌బాబు ప్రస్తావిస్తూ – ‘‘ఒక్కొక్కసారి పండగకు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్నీ బాగానే ఆడతాయి.
అలాగే ఈ నెల 11ని ప్రేక్షకులు పండగలా, అన్ని సినిమాలను ఆదరిస్తారనుకుంటున్నాను. మిగతా సినిమాల నిర్మాతలతో సంప్రదించడం జరిగింది. కానీ, ఎవరూ వెనక్కు వెళ్లలేని పరిస్థితి. ఎవరైనా వెనక్కు వెళితే భయపడ్డారనే పుకార్లు వస్తాయి. అందుకే వెళ్లలేదు. మా సినిమాపై నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమాల గురించి సురేశ్‌బాబుగారి దగ్గర ఏడాది పాటు ఒక పీజీ డిప్లొమా కోర్స్ చేసినట్లు ఉంది. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ బాగా చేస్తే ప్రొడక్షన్‌లో అన్ని బాధలు తగ్గుతాయని ఆయన దగ్గర నేర్చుకున్నాను. తేజగారు బాగా డైరెక్ట్ చేశారు. రానా సూపర్‌గా యాక్ట్ చేశారు’’ అని కిరణ్‌రెడ్డి అన్నారు. ‘‘గ్రేట్ ప్రొడ్యూసర్ సురేష్‌బాబుగారితో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కథను నమ్మి ఈ సినిమా తీశాం. రానాగారిని ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందన్న నమ్మకం ఉంది. తేజగారి లాంటి డైరెక్టర్‌తో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు భరత్ చౌదరి.