ముందు స్టోరీ... తర్వాతే టెక్నాలజీ!
‘‘వైవిధ్యమైన పాత్రలు చేయాలనే నటుణ్ణి అయ్యా. ప్రతిసారీ ఒకే రకమైన పాత్రలు చేస్తే చూడ్డానికి ప్రేక్షకులకు, చేయడానికి నాకు బోర్. కొత్త క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ పాత్ర నుంచి ఏం నేర్చుకోవాలా? అని ఆలోచిస్తా. క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం ఇష్టం. ఇప్పటివరకు చేసిన పాత్రలతో సంతోషంగా ఉన్నా’’ అన్నారు రానా. ఆయన హీరోగా తేజ దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి. కిరణ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈరోజు సినిమా విడుదలవుతున్న సందర్భంగా రానా చెప్పిన విశేషాలు...
♦ మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ నుంచి సినిమా చేద్దాం అనుకున్నా కుదర్లేదు. ఇప్పుడైనా చేయడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకు (డి.సురేశ్‌బాబు), నాకు స్టోరీ నచ్చింది. బాబాయ్ వెంకటేశ్‌గారు కథ విని హ్యాపీ. ఒక సినిమా మీద ఓనర్‌షిప్ ఉంటే బాగా చేయొచ్చు. ఈ సినిమాకి మా నాన్నగారు ఓ నిర్మాత కావడం నా లక్.
♦ ‘లీడర్’ సినిమాలోని అర్జున్‌ప్రసాద్ మంచోడు. ‘నేనే రాజు నేనే మంత్రి’లో జోగేంద్ర(రానా పాత్ర పేరు) అంత మంచోడు కాదు. ఈ చిత్రంలో రాజకీయాలు ఒక అంశం మాత్రమే. రాధా, జోగేంద్ర అనే భార్యాభర్తల కథ ఇది. కరువు ప్రాంతంలో ఉంటూ సింపుల్ అండ్ హ్యాపీలైఫ్‌ను లీడ్ చేసే జోగేంద్ర క్రైమ్, పాలిటిక్స్, మనీ అనే ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెడతాడు? ఏం చేశాడన్నదే చిత్ర కథ.
♦ ‘బాహుబలి’ కోసం కండలు పెంచా. జోగేంద్ర చాలా కామన్‌మ్యాన్. అందుకోసం కష్టపడి బరువు తగ్గా. ఈ సినిమాకు ఆత్మ కథే. టెక్నాలజీ అనేది స్టోరీని సపోర్ట్ చేసే ఒక అంశం మాత్రమే. టెక్నాలజీ మీదే ఆధారపడితే సినిమాలు ఆడకపోవచ్చు. ముందు కథ ముఖ్యం. తర్వాతే టెక్నాలజీ అని నమ్ముతాను. విడుదలకు ముందు కొంచెం డబ్బులు మిగిలితే అది ఫైనాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్æమూవీనే.
♦ ‘నేనే రాజు నేనే మంత్రి’ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. తమిళ రాజకీయాలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందంటున్నారు. మేం తీసిన తర్వాత కనెక్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది. నేను ప్రతిసారి పొలిటికల్ సినిమా చేస్తుంటే అది ఎవరికో ఎప్పుడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంది (నవ్వుతూ) .
♦ కాంపిటీషన్ అంటే ఫస్టఫాల్ నేను చేసే సినిమాలు ఇంకెవరూ చేయరని నా అభిప్రాయం. ఈరోజు విడుదలవుతున్న సినిమాలు వేటికవే డిఫరెంట్. బిగ్ వీకెండ్. ఇండిపెండెన్స్ వీకెండ్ అనేది ఒక సంక్రాంతి వీకెండ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ మూవీ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి త్వరలోనే పూర్తి వివరాలు చెబుతా. .