Katherine
-
ఎలక్ట్రిక్ కియా.. ఆగయా: నటి క్యాథెరిన్, జానీ మాస్టర్ సందడి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్ల కంపెనీ కియా సరికొత్త పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం తొలిసారిగా మార్కెట్ లోకి వస్తోంది. త్వరలో వినియోగదారుల కు అందుబాటులో కి రానున్న ఈ కార్ ని హైదరాబాద్ లో ప్రదర్శించారు. · హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన కియా ఈవీ6 ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటి క్యాథెరిన్, సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్ ; షోరూమ్ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ, జీఎం వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్ కియా, హైటెక్ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 3లక్షల రూపాయల టోకెన్ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్ చేసుకో వచ్చు. దేశవ్యాప్తంగా 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్ 2022లో విడుదల చేయనున్నట్టు కియా ప్రతినిధులు తెలిపారు. ప్రత్యేకతలివీ... ఈ కియా ఈవీ6ను ఈ–జీఎంపీ పై నిర్మించారు. అత్యంత వేగవంతమైన చార్జింగ్, అసాధారణ పనితీరుల సమ్మేళనంగా ఉంటుంది. ఈవీ 6 ఇండియా వెర్షన్లో 77.4 కిలోవాట్ హవర్ లిథయం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్ విద్యుత్ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్లో 325పీఎస్ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుంది. కియా ఈవీ6లో సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వెడల్పాటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్రైవర్, ప్యాసెంజర్ రిలాక్సేషన్ సీట్లు, రిమోట్ ఫోల్డింగ్ సీట్లు, ఏఆర్ హెడ్ అప్ డిస్ప్లే వంటివి దీనిలో ఉన్నాయి. భద్రత పరంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు దీనిలో ఉన్నాయి. కియా ఈవీ 6 వాహనం మూన్‌స్కేప్, స్నో వైట్ పెరల్, రన్‌వే రెడ్, అరోరా బ్లాక్ పెరల్, యాచ్ బ్లూ –రంగుల లో లభిస్తుంది. -
బుసలు కొట్టబోతున్నది ఎవరు?
రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్షీ శరత్‌కుమార్... ఈ ముగ్గురి భామల్లో బుసలు కొట్టబోతున్నది ఎవరు? అప్సరసల్లా ఉండే వీళ్లు బుసలు కొట్టడమేంటి అనుకుంటున్నారా? దానికి కారణం లేకపోలేదు. ఈ ముగ్గురూ కలసి ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు. ఇదొక లవ్ థ్రిలర్. ఈ కథలో పాములకు ప్రాధాన్యం ఉంది. మరి.. ఈ ముగ్గురిలో ఎవరు నాగినిగా నటిస్తారు? అనేది మాత్రం చిత్రబృందం బయటపెట్టలేదు. ఆ చాన్స్ ఉందని చెన్నై టాక్. ‘జర్నీ’, ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జై ఇందులో హీరో. ఐటీ ఉద్యోగిగా కనిపించబోతున్నారాయన. జైని ముగ్గురు కథానాయికలూ ప్రేమిస్తారట. ఒకరు మాత్రం పగ తీర్చుకోవడానికి ప్రేమ నటిస్తారని సమాచారం. ‘ఏతన్’ మూవీ ఫేమ్ సురేష్ ఈ చిత్రానికి దర్శకుడు. జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. చెన్నై, మధురై, కేరళలో చిత్రీకరించనున్నారు. ‘‘షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ లవ్ థ్రిల్లర్ షూటింగ్ అంతా సరదాగా జరగాలని ఆశిస్తున్నా’’ అని రాయ్ లక్ష్మీ అన్నారు. ఇంత చెప్పారు కదా? స్నేక్ ఎవరూ అంటే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అంటున్నారు. -
ఎవరూ వెనక్కి వెళ్లలేని పరిస్థితి!
– డి.సురేశ్ బాబు ‘‘సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాతగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా, యాక్టర్‌గా రావాలని చాలామంది అనుకుంటారు. కానీ అందరి కలలు నిజం కావు. తక్కువమంది సక్సెస్ అవుతారు. నాకు మా ఫాదర్ (డి. రామానాయుడు) ఒక కంపెనీ తయారు చేసి పెట్టారు. నా తమ్ముడు (వెంకటేశ్) యాక్టర్. తనతో సినిమాలు తీస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు (రానా) కూడా ఉన్నాడు. ఎక్కడో నేను బ్లెస్డ్ అనుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. రానా, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డి.సురేశ్‌బాబు, సీహెచ్. భరత్‌చౌదరి, వి.కిరణ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇది రాధ, జోగేంద్ర స్టోరీ. రాధ, జోగేంద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. తర్వాత లవర్స్.. ఆ తర్వాత భార్యాభర్తలు. అనుకోని కారణాల వల్ల రాధకు దూరమవుతాడు జోగేంద్ర. చివరికి రాధ దగ్గరకు వెళ్లి ఫైనల్‌గా ఎలా సెట్ అయ్యాడన్నదే చిత్రకథ. మూడో అమ్మాయి క్యాథరిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అన్నారు. ఈ నెల 11న మరో రెండు సినిమాలు విడుదలవుతున్న విషయం గురించి సురేశ్‌బాబు ప్రస్తావిస్తూ – ‘‘ఒక్కొక్కసారి పండగకు మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. అన్నీ బాగానే ఆడతాయి. అలాగే ఈ నెల 11ని ప్రేక్షకులు పండగలా, అన్ని సినిమాలను ఆదరిస్తారనుకుంటున్నాను. మిగతా సినిమాల నిర్మాతలతో సంప్రదించడం జరిగింది. కానీ, ఎవరూ వెనక్కు వెళ్లలేని పరిస్థితి. ఎవరైనా వెనక్కు వెళితే భయపడ్డారనే పుకార్లు వస్తాయి. అందుకే వెళ్లలేదు. మా సినిమాపై నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమాల గురించి సురేశ్‌బాబుగారి దగ్గర ఏడాది పాటు ఒక పీజీ డిప్లొమా కోర్స్ చేసినట్లు ఉంది. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ బాగా చేస్తే ప్రొడక్షన్లో అన్ని బాధలు తగ్గుతాయని ఆయన దగ్గర నేర్చుకున్నాను. తేజగారు బాగా డైరెక్ట్ చేశారు. రానా సూపర్‌గా యాక్ట్ చేశారు’’ అని కిరణ్‌రెడ్డి అన్నారు. ‘‘గ్రేట్ ప్రొడ్యూసర్ సురేష్బాబుగారితో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కథను నమ్మి ఈ సినిమా తీశాం. రానాగారిని ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందన్న నమ్మకం ఉంది. తేజగారి లాంటి డైరెక్టర్‌తో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు భరత్ చౌదరి. -
కేథరిన్‌తో షికారు
‘ఎర్రబస్సు’ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలు తెలుసుకుంది. బ్యాటరీ కార్లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది. ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? మాసాయిపేట మానసపుత్రి రుచితజడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే..‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ నల్లగొండ ఖేల్ రత్న వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
‘రేడియో సిటీ’లో కేథరిన్ సందడి
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రేడియోసిటీ 91.1 ఎఫ్ఎం స్టేషన్లో నటి కేథరిన్ సందడి చేసింది. గురువారం సాయంత్రం రేడియో స్టేషన్‌కు విచ్చేసిన ఈ తార తాను నటించిన లేటెస్ట్ సినిమా ఎర్రబస్సు సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. - బంజారాహిల్స్ -
26న తెరపైకి మెడ్రాస్
ఎట్టకేలకు మెడ్రాస్ చిత్రం విడుదలకు తేదీ ఖరారైంది. కార్తీ హీరోగా నటించిన తాజా చిత్రం మెడ్రాస్. ఆయనకు జంటగా క్యాథరిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావలసింది. చిత్ర టైటిల్‌పై తమిళ భాషా పరిరక్షక సంఘాలు తమిళ భాషాభిమానులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడ్రాస్ను చెన్నై నగరంగా మార్చిన చాలా ఏళ్ల తరువాత మళ్లీ పాత మెడ్రాస్ను గుర్తు చేసే ఈ చిత్రం టైటిల్‌ను పెట్టడం మంచిది కాదంటూ ఘోషిస్తున్నారు. ఏదైమైనా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఓకే చెప్పింది. ఇటీవల మెడ్రాస్ చిత్రాన్ని తిలకించిన సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మాస్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నారుు. మరో విషయం ఏమిటంటే ఈ మధ్య కార్తీ నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మెడ్రాస్ చిత్రం విజయం సాధించడం కార్తీకి చాలా అవసరం. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. -
నాన్న మెచ్చిన కూతురు!
అనంతరం: ప్రపంచమంతా తెలిసిన ప్రముఖ నటుడి ఇంటి తొలి సంతానంగా జన్మించింది క్యాథరీన్. తండ్రి చేయి పట్టుకుని అడుగులు వేయడం నేర్చుకుంది. తండ్రి ఒడిలో కూచునే ప్రపంచాన్ని తెలుసుకుంది. కానీ తండ్రి దారిలో నడవడానికి మాత్రం ఇష్టపడలేదు. నటన కంటే వాస్తవాల మీద ఆసక్తి చూపించింది. రచయిత్రి అయ్యింది. ఇంతకీ క్యాథరీన్ ఎవరో తెలుసా... ఆర్నాల్డ్ ష్వార్జ నెగ్గర్ ముద్దులపట్టి! క్యాథరీన్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్నాల్డ్ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయడం కాస్త కష్టమే. కూతురి గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతారాయన. తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నప్పుడు ఆర్నాల్డ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ‘‘నేనెప్పుడూ ఇది చెయ్యి అని క్యాథీకి చెప్పలేదు. ఏం చేయాలో తనే నిర్ణయించుకుంది. తానేం చేసినా నేను ప్రోత్సహిస్తానని తనకు తెలుసు. తాను ఏం చేసినా నాకు పేరు తెచ్చే పనే చేస్తుందని నాకూ తెలుసు. అందుకే పెద్దగా కల్పించుకోను’’ అంటారు మురిసిపోతూ. హాలీవుడ్ హీరోల పేరు చెప్పమని మన వాళ్లెవరినైనా అడిగితే వెంటనే నోటికొచ్చే పేర్లలో ఒకటి... ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్! టెర్మినేటర్, ప్రిడేటర్ వంటి సినిమాలతో భారతీయుల మనసులను అంతగా దోచారాయన. రాజకీయ నాయకుడిగా, ఇన్వెస్టర్‌గా కూడా ప్రపంచమంతటికీ చిరపరిచితుడైన ఆర్నాల్డ్‌కి నలుగురు పిల్లలు. ఆ నలుగురిలో పెద్దమ్మాయి... క్యాథరీన్. పిల్లలందరూ సమానమే అయినా... తండ్రి అయిన సంతోషాన్ని తొలిసారి రుచి చూపిన క్యాథరీన్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఆర్నాల్డ్‌కి. సాధారణంగా కొడుకు తన అడుగు జాడల్లో నడవాలని తండ్రి కోరుకుంటాడు. అయితే ఆర్నాల్డ్‌కి కొడుకులు ప్యాట్రిక్, క్రిస్టఫర్ల మీద కంటే... పెద్ద కూతురు క్యాథరీన్ మీదే నమ్మకం ఎక్కువ. తన ఆలోచనలను, ఆశయాలను నిలబెట్టే సత్తా ఆమెకి ఉందని ఆయన విశ్వాసం. అది నిజమే. క్యాథరీన్ చాలా తెలివైన అమ్మాయి. తండ్రికి మంచి పేరు తీసుకురావాలని తపిస్తుంది. కానీ ఆయన అడుగు జాడల్లో నడవాలన్న ఆలోచన మాత్రం ఆమెకు లేదు. క్యాథరీన్ తరువాత పుట్టిన ప్యాట్రిక్ మోడల్ అయ్యాడు. ఆ తరువాత నటుడు కూడా అయ్యాడు. కానీ క్యాథరీన్ మాత్రం నటన వైపు మొగ్గు చూపలేదు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే... ఆమె కచ్చితంగా నటి అవుతుందనే అనుకున్నారంతా. తండ్రే లోకంగా భావించే ఆమె తండ్రి బాటలోనే సాగుతుందని భావించారు. ఆమె అద్భుత సౌందర్యరాశి కావడం, నటి కాదగ్గ అన్ని లక్షణాలూ ఉండటం కూడా అలా అనుకునేలా చేశాయి. కానీ అందరి అంచనాలనూ తల్లకిందులు చేసింది క్యాథరీన్. తండ్రిని అమితంగా గౌరవించినా, కెరీర్ విషయంలో మాత్రం తన తల్లిని అనుసరించింది. ఆర్నాల్డ్ భార్య, క్యాథరీన్ తల్లి మారియా ష్రివర్కి జర్నలిస్టుగా, రచయిత్రిగా మంచి పేరుంది. ఎందుకోగానీ... తండ్రి ఆలోచనల కంటే తల్లి భావాలే క్యాథరీన్నే ఎక్కువ ప్రభావితం చేశాయి. అందుకే మాస్ కమ్యునికేషన్స్ చదివింది. కెమెరా ముందుకు రానంటూ కలం పట్టుకు కూచుంది. 2010లో ‘రాక్ వాట్ యు హ్యావ్ గాట్’ అనే పుస్తకం కూడా రాసింది. మహిళలు ఎవరి మీదా ఆధారపడకూడదని, తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని, ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని చెబుతూ ఆమె రాసిన ఆ పుస్తకం విమర్శకుల ప్రశంసలు పొందింది. కూతురిలో అంత మంచి రచయిత్రి ఉందని ఊహించని ఆర్నాల్డ్ ఆశ్చర్యపోయారు. తన కూతురి అభిరుచిని మెచ్చుకున్నారు. ఆమె ఎంచుకున్న బాటలో తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి క్యాథరీన్‌కి పుట్టుకతోనే కొద్దిపాటి శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడ్డాయి. ఏడో తరగతి అయ్యేవరకూ చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొద్దికొద్దిగా నిలదొక్కుకుంది. ఇదంతా కూడా ఆమె పట్టుదలతో సాధించింది అంటారు ఆమె గురించి తెలిసినవాళ్లంతా. ఏదైనా కూడా ఎందుకు సాధ్యం కాదు అన్న ప్రశ్న వేస్తుందామె. అనుకోవాలేగానీ చేయలేనిదేమీ లేదు అంటుంది దృఢంగా. అది తల్లి ఇచ్చిన ప్రోత్సాహం. అంతకంటే ముఖ్యంగా తండ్రి ఇచ్చిన ధైర్యం. తన తండ్రి గురించి చెప్పమంటే ఇలా చెబుతుంది క్యాథరీన్. ‘‘నాన్న పెద్ద సెలెబ్రిటీ. ఆయన ఇమేజ్ నన్ను చాలా ఆనందింపజేస్తుంది. కానీ ఆయన ఇమేజ్‌తో నేను ఎదగాలనుకోను. నాకు నేను సంపాదించుకున్న మంచిపేరుతో ఆయన ఇమేజ్‌ని మరింత పెంచాలనుకుంటాను.’’ ఈ ఆత్మవిశ్వాసం క్యాథరీన్ కళ్లలో, బాడీ లాంగ్వేజ్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు ఆమె తండ్రి కళ్లలో గర్వం తొంగిచూస్తుంది! -
రుద్రమతో ఆడిపాడుతున్న నిత్యామీనన్, కేథరిన్
రాణీరుద్రమ వీరత్వం గురించి తెలియని వారు తెలుగునేలపై లేరు. కానీ రుద్రమలో అంతర్గ తంగా దాగున్న కళలెన్నో. చరిత్రను అధ్యయనం చేసిన కొందరికే వాటి గురించి తెలు స్తుంది. ఆ కొందరిలో ఇప్పుడు గుణశేఖర్ కూడా ఒకరు. కాకతీయ ప్రాభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి రాణీరుద్రమదేవి చరిత్రను ఆకళింపు చేసుకొని దాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారాయన. కదనరంగంలోనే కాదు, కళారంగంలోనూ రుద్రమ దిట్టేనని, కత్తి పట్టినా.. కాళ్లకు గజ్జె కట్టినా... రుద్రమకు సాటి రుద్రమేనని తన సినిమా ద్వారా తెలియజేయనున్నారు గుణశేఖర్. ‘రుద్రమదేవి’గా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన భారీ అంతఃపురం సెట్లో అనుష్కపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఈ పాటలో అనుష్కతో పాటు నిత్యామీనన్, కేథరిన్ కూడా నర్తిస్తుండటం విశేషం. గత మూడు రోజులుగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో గోనగన్నారెడ్డి ప్రియురాలిగా కేథరిన్ నటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గోనగన్నారెడ్డి పాత్రలో సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే నిజమైతే కేథరిన్ చాలా లక్కీ అన్నమాటే. మరి ఇందులో నిత్యామీనన్ పోషిస్తున్న పాత్ర ఏంటో తెలియాల్సి ఉంది. రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాష్‌రాజ్, బాబా సెహగల్, నథాలియా కౌర్, జరాషా, హంసానందిని, మధుమిత కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఆదిత్య మీనన్, జయప్రకాష్‌రెడ్డి, అతిథి చంగప్ప, అజయ్, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, ఎల్బీశ్రీరామ్, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: అజయ్ విన్సెంట్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతాలుల్లా (‘జోథా అక్బర్’ ఫేం), ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, నిర్మాణం: గుణా టీమ్ వర్క్స్. -
నాది రొమాంటిక్ ఫిజిక్ : కేథరిన్
హీరోలకు పరాజయాలతో నిమిత్తం ఉండదు. ఓ సినిమా ఫ్లాపైనా... మరో సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ హీరోయిన్లకే సమస్యంతా. వరుసగా రెండు ఫ్లాపులోస్తే చాలు... ‘ఇక ఇంటికే’ అనేస్తారు. కానీ కేథరిన్ కెరీర్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. తొలి సినిమా ‘చెమ్మక్చెల్లో’ ఫ్లాప్. రెండో సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’ కూడా సో.. సో... అనిపించుకుంది. మూడో సినిమా ‘పైసా’ విడుదలకు పురిటి నెప్పులు పడుతోంది. కానీ... వీటితో సంబంధం లేకుండా... ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ దుబాయ్ భామ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ‘‘నిజానికి నేను సినిమాల్లోకి వెళ్లడం నాన్నకు ఇష్టం లేదు. నేను సక్సెస్ కాలేనని ఆయన అనుమానం. కానీ ఇప్పుడు మాత్రం నాన్న చాలా హ్యాపీ. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటే... చెప్పలేనంత అనందంగా ఉంది’’ అంటున్నారు కేథరిన్. మీలోని ప్రధాన ఆకర్షణ ఏంటి? అనడిగితే- ‘‘నా కళ్లు. అవి చాలా అమాయకంగా ఉంటాయంటారు అందరూ. అంతేకాదు... నా ఫిజిక్ కూడా రొమాంటిగ్గా ఉంటుందని నా ఫ్రెండ్స్ అభిప్రాయం’’ అంటూ పకపకా నవ్వేశారు కేథరిన్. పూరిజగన్నాథ్ తాజా చిత్రంలో కథానాయికగా కేథరిన్ ఎంపికయ్యిందని విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా ఓ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్లు వినికిడి.