కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) మనకోసంను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందజేశారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినీ కార్మికులకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. సీసీసీకి రూ. 2 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ.. రూ. 2లక్షలను గురువారం రోజున ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చెప్పారు.
కాగా, కరోనాకు సంబంధించి కాజల్ ప్రజల్లో అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండంతో.. రాబోయే రోజుల్లో భారతీయ వ్యాపారులకు అండగా ఉండాలని కాజల్ పిలుపునిచ్చారు. కరోనా రోజువారి కూలీలను ఎంతగా దెబ్బతీస్తుందో తెలిపేలా.. ఓ క్యాబ్ డ్రైవర్ దుస్థితిని షేర్ చేశారు. ఆ ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో అవకాశం దక్కించుకున్న కాజల్.. పవన్ చిత్రంలో కూడా కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
చదవండి : పక్కా లోకలైపోదాం!
Comments
Please login to add a commentAdd a comment