దిగులు పడొద్దు!
‘‘మంచో.. చెడో.. లవ్‌లో ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ అయినట్లు కాదు. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలి. బ్రేకప్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలి’’ అని కాజల్ అగర్వాల్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. కొంపతీసి కాజల్ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? ఆ ప్రేమకు మధ్యలోనే ఎండ్ కార్డ్ పడిందా? అని ఆలోచించవలసిన అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదొక తరుణంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడతారు.
ప్రతి ప్రేమకథా పెళ్లి పీటల వరకూ వెళ్తుందా..? అని ప్రశ్నిస్తే సమధానం చెప్పడం కష్టమే. లవ్.. బ్రేకప్.. యూత్ రిలేషన్షిప్స్.. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘కవలై వేండాం’లో కాజల్ నటించారు. దిగులు పడొద్దు అని ఆ టైటిల్ అర్థం. ఆ సినిమాలో నటించిన అనుభవంతో కాజల్ బ్రేకప్ చిట్కాలు చెప్తున్నారు. ‘లవ్.. బ్రేకప్.. లైఫ్‌లో పాసింగ్ క్లౌడ్స్ వంటివి. ఒకవేళ లవ్‌లో పడ్డా మనం ఎవరు అనేది మరువకూడదు.
మన ప్రాముఖ్యతను ఎప్పటికీ తగ్గించుకోకూడదు. లవర్ తప్ప మరో ప్రపంచం లేదనట్లుగా బతకకూడదు. అప్పుడు బ్రేకప్ అయినా పెద్దగా బాధ అనిపించదు. బ్రేకప్ నుంచి బయటకు రావడానికి ఓ నినాదం అంటూ ఏమీ లేదు’’ అని సెలవిచ్చారు కాజల్. ఇటీవల ఎక్కడ చూసినా.. కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలే. కాజల్ కూడా త్వరలో ఈ కబుర్లు చెప్పే అవకాశం వస్తుందా? అంటే ‘అందుకు చాలా టైముంది!’ అని నవ్వేశారు.