love fail
-
ప్రేమ విఫలం... బలవన్మరణం
నెక్కొండ/శాంతినగర్: ప్రేమ విఫలం కావడంతో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండకు చెందిన చింతల జయంత్ (22) ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలని జయంత్‌ను యువతి తల్లిదండ్రులు మందలించారు. యువతి సైతం అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ నెల 27న తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జయంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీసి.. సూసైడ్ నోట్ రాసి.. ప్రేమించి మోసపోవద్దని, తాను మోసపోయి ఆ త్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జోగులాంబ–గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ స్టేజీకి చెందిన తెలిగి అశోక్ (22) మంగళవారం రాత్రి కర్నూలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు.. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, యువతి తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నందున తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, తన చావుకు కారణమైన వారిని వదలొద్దంటూ వీడియోలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బుధవారం అశోక్ మృతదేహాన్ని తీసుకొ చ్చి అలంపూర్–రాయచూర్ రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేస్తామని సీఐ రవిబాబు చెప్పారు. -
ప్రేమ విఫలమై.. యువతి తీవ్ర నిర్ణయం.. చివరికి..
మహబూబ్‌నగర్: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని విఠలాపురంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఊస్సేన్‌సాబ్, ఖాజాబీకి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె షెహనాబీ (19) హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదివేది. ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన ఖాజా సమీప బంధువు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాలకు అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తండ్రి ఊస్సేన్‌సాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వివరించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేయసికి వివాహం.. ప్రియుడి ఆత్మహత్య
మార్టూరు: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. ఆమె గత వారం భర్తను వదిలి నీతోనే ఉంటానని కిశోర్ ఇంటికి వచ్చింది. ఆమె భర్త తరఫు బంధువుల ఫిర్యాదుతో విషయం పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి దారిన వారిని పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిశోర్ టవల్‌తో ఇంటి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కిశోర్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించి వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో కిశోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సార్! ఎలా ఉన్నారు. మీకూ, నీలాంబరికీ అరటిపండు దండం సార్. నేను మా జూనియర్ని లవ్ చేస్తున్నాను. తనకి లవ్ చెయ్యడమన్నా, కలిసి తిరగడమన్నా చాలా చిరాకు. ఫ్రెండ్‌గా ఉండమంటోంది. ఏదో ఆశించే మనసుకి ఫ్రెండ్ అనే ముసుగు వేయడం అవసరమా అని దూరంగా ఉన్నాను. తను నాకు కావాలి సార్! ఏం చెయ్యను?? – అయ్యప్ప ముసుగేసుకో!!‘ఎందుకు సార్ మీరు అంత నిష్ఠూరంగా మాట్లాడతారు..?? ఇష్టం లేకపోతే ఆన్సర్ ఇవ్వకండి. అంతే కానీ... ముసుగేసుకో.. నీ ముఖానికి లవ్ ఏంటి? అమ్మాయి ఫ్రెండ్ అంటుంటే.. నీకు వేరే ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయిరా డర్టీ ఫెలో...? తప్పు పని చేస్తేనే కదా ముసుగులు అవసరం..! అలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు రా బ్యాడ్ బాబు..? అని ఒక లవర్ని కించపరచడం తప్పు కాదాసార్? మీరే చెప్పండి సార్?!!’నిజమే నీలూ..! లవ్ వద్దు ఫ్రెండ్ అయితే ఓకే అన్నప్పుడు కావాలంటే ఒక మంచి ఫ్రెండ్‌లా ఉండాలి. ఫ్రెండ్‌లాగా అమ్మాయిని కాపాడాలి. అంతేకానీ కోరుకోకూడదు. అందుకే.... ‘ఓ... ఓహో... ఓహోహో... బ్యాడ్ ఆలోచనలకు ముసుగు వేసుకుని బీ ఎ గుడ్ ఫ్రెండ్ అంటున్నారు. సూపర్ సార్!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
ప్రేమన్నాడు.. ప్రాణంతీశాడు
చౌటుప్పల్ : ఆ యువతికి అప్పటికే వివాహ నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా రోజూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే మరింతగా బరితెగించిన ఆ యువకుడు ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నాడు. తనవెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై యువతిని బలవంతంగా ఎత్తుకెళ్తుండగా.. తప్పించుకునేందుకు యువతి విశ్వప్రయత్నం చేసింది. బైక్ పైనుంచి కిందకు దూకి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోదనపు మదుసూధన్‌రెడ్డి కుమార్తె శ్వేత చౌటుప్పల్ మండలంలోని నేతాజీ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన అదే గ్రామానికి చెందిన భరత్ శ్వేతను నిత్యం ప్రేమ, పెండ్లి పేరుతో వేధించేవాడు. తనకు ఇష్టంలేదని చెప్పినా వినిపించుకోలేదు. శ్వేతకు గత నెల 15వ వివాహ నిశ్చితార్ధం జరిగింది. కాగా గత నెల 30న ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకోసం చౌటుప్పల్ మండలంలోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం సాయంత్రం బయటకు వచ్చింది. అప్పటికే భరత్ అక్కడ వేచిఉన్నాడు. తనను పెండ్లి చేసుకోవాలని, లేదంటే ఏం చేస్తానో తెలియదంటూ శ్వేతను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో వేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి జారీ శ్వేత రోడ్డుపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌కు తీసుకురాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తణుకు: పట్టణంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ స్కూలుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (18) తణుకులోని నర్సింగ్ స్కూల్లో చదువుతోంది. ఈమె కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన హెప్సిబారాణి ఆదివారం తన హాస్టల్ గదిలోని నరానికి మత్తు ఇంజక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికి కుప్పకూలిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. హెప్సిబారాణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన పాస్టర్ సంరక్షిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి తను నన్ను అన్నయ్యా అని పిలుస్తోంది. నేను కూడా తనని చెల్లెల్లానే చూసుకునేవాడిని! తనకి జాబ్ హైదరాబాద్‌లో వచ్చింది! నేను కూడా హైదరాబాద్‌లో ఉండే ప్రిపేర్ అవుతుండటంతో తన మంచిచెడులన్నీ నేనే చూసుకునేవాడిని. దాంతో కొంచెం క్లోజ్ అయ్యాం. రోజూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. తను కూడా అదే అంటోంది. ఈ మధ్య తనకి సంబంధాలు చూస్తున్నారు. దాంతో నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. మా మధ్యలోకి థర్డ్ పర్సన్ వస్తున్నాడనేనా? ఎందుకో తెలియదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ ఎప్పటికైనా అదే కదా జరిగేది! నేను కంప్లీట్‌గా మారిపోయి నా వర్క్ ఏంటో నేను చూసుకోవాలి. నాకు సలహా ఇవ్వండి సార్ ప్లీజ్!? - నాగరాజ్ ‘నీలాంబరి అక్కా.. ఇదే మనకు బెస్ట్ ఛాన్స్..!’ ‘‘దేనికి బెస్ట్ ఛాన్స్ అరటిపండూ..?’’ ‘ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తే... మీసాలోడు బుట్టలో పడ్డట్టే... నీలాంబరి అక్కా!’ ‘‘బుట్టలో అంటే? నా బుట్టలోనా? నీ బుట్టలోనా!?! అరటిపండూ..?’’ ‘ఈ తొక్క క్వశ్చన్ మీద కాలు పడితే డైరెక్ట్‌గా చెత్త బుట్టే అక్కా!’ ‘‘ఆ తరువాత నేనే లవ్ డాక్టరా?.. పండూ?’’ ‘చెలరేగిపో అక్కా.. అదిగో వస్తున్నాడు. ఎలాగయినా ఆన్సర్ ఇప్పించు!’ ‘‘సార్ మీ ఆన్సర్ కోసం నాగరాజు వెయిటింగ్!’’ స్నేహాన్ని లవ్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని సమాజాన్ని గౌరవిస్తే వెధవ ఆలోచనలు రావు! ముందు మాటలు తగ్గించండి. చేసే పనిమీద ఫోకస్ పెట్టండి. అనవసరమైన ఆలోచనలతో మనసు ఇంకా అసహ్యంగా తయారు చేసుకోవద్దు. జీవితంలో చాలా వదిలేసుకోవాల్సొస్తుంది. దాంట్లో ఇది చాలా చిన్న విషయం నాగరాజ్! ఐ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యు. శహబాష్!! ‘‘సార్......’’ ఏమైంది నీలాంబరీ! కళ్లు తిరిగి పడిపోయావా? అరే అదేంటి? అరటిపండు చెత్త బుట్టలో పడిపోయింది...!? - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
ప్రేమ విఫలం..యువకుడి ఆత్మహత్య
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మాధవ రెడ్డి బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన యువకుడు బోడుప్పల్‌కు చెందిన విజయ్‌కుమార్(25)గా గుర్తించారు. విజయ్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తుర్కపల్లి మండలం బాపల్లి గ్రామం. సంఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
‘చచ్చిపోయినా నిన్ను మర్చిపోను బావా’
► ప్రేమ విఫలం కావడంతో యువతి బలవన్మరణం ► ఇంట్లో దూలానికి ఉరివేసుకున్న వైనం ► చివరిగా ప్రియుడు, తల్లిదండ్రులకు లేఖలు ► తాళ్లపాలెంలో విషాద ఘటన నిడదవోలు రూరల్: ‘ప్రియమైన బావకు నువ్వంటే నాకు ప్రాణం.. నేనంటే నీకు చాలా ఇష్టం కదరా.. మరి నన్ను ఎలా మోసం చేశావు.. నన్ను ఎందుకు వదిలేశావు. నీతో పెళ్లి అనగానే ఎన్నో కలలు కన్నాను. నాలో చాలా కోరికలు.. ఆశలు పెట్టుకున్నాను. నువ్వే నా ప్రాణం రా.. నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నీ జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నాను. నేను చనిపోయినా మరిచిపోనురా’ అంటూ తన ప్రియుడికి చివరసారిగా ప్రియురాలు లేఖ రాసి తనువు చాలించింది. ప్రేమ విఫలం కావడంతో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిడదవోలు మండలం తాళ్లపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన పిల్లి కొండబాబు, బేబి దంపతులు తాళ్లపాలెంలో నివాసముంటున్నారు. వీరి పెద్ద కుమార్తె నాగరత్నం (21) ఏడో తరగతి వరకు చదివి కొంతకాలం హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుం బానికి ఆసరాగా ఉండేది. ఆ సమయంలో వీరి బంధువు అట్లపాడు గ్రామానికి చెందిన పెంటపాటి సొలోమాన్ కుమారుడు కల్యాణ్‌ను ఇష్టపడింది. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నా రు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంతో నాగరత్నం కుటుంబసభ్యులు రూ.74 వేలను ఆరు నెలలు క్రితం కల్యాణ్ కుటుంబానికి అప్పుగా ఇచ్చారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని నాగరత్నం ఎంతో ఆశ పెట్టుకుంది. అయితే పెద్దలు వీరి వివాహానికి పూర్తిగా అంగీకరించకపోవడంతో కల్యాణ్ సుమారు 13 రోజులుగా నాగరత్నంకు ఫోన్ చేయడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరి వేసుకుని తనువు చాలించింది. మృతురాలి తల్లి బేబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మనస్తాపంతో రెండు లేఖలు నాగరత్నం ఉరివేసుకునే ముందు కల్యాణ్ ప్రేమ విషయంలో చాలా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. నాలుగు పేజీల ప్రేమలేఖను ప్రియుడి పేరుపై రాసింది. మరో రెండు పేజీల లెటర్‌ను తల్లిదండ్రులకు రాసింది. నాన్న ఎంతో మంచివాడని జాగ్రత్తగా చూసుకోమని తల్లి బేబిని కోరింది. తన భర్తగా కల్యాణ్‌ను ఊహించుకున్నానని, తమ ప్రేమకు కల్యాణ్ తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రెండు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. videofor -
అమ్మా.. క్షమించు..
►నా బంగారం లేనిదే బతకలేను ►ప్రేయసి దూరమైందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య వేములవాడ: ‘అమ్మా.. నన్ను క్షమించు.. నా బంగారం(తాను ప్రేమించిన యువతి) లేనిదే బతకలేనని నీకు ముందే చెప్పా.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నా మిత్రుడు మిథున్‌కు చెందిన బంగారంపై నేను యూఏఈ ఎక్సేఛేంజీలో లోను తీసుకున్నా.. ఆ లోను చెల్లించి బంగారం వాడికి అప్పగించండి’ అని సూసైడ్ నోట్ రాసి రాపర్తి హరీశ్(26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. బద్దిపోచమ్మవీధిలో హరీశ్ తన తల్లి, ఒక సోదరితో కలిసి కొన్నేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంటిని ఖాళీ చేసి సుభాష్‌నగర్‌లోని మరో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఖాళీ చేసిన ఇంట్లో ఇంకా కొంత సామగ్రి అలాగే ఉంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు భీమేశ్వరాలయం సమీపంలోని తాను నడిపిస్తున్న టిఫిన్ సెంటర్లో పనులు పూర్తి చేసుకున్న హరీశ్.. ఇంటికొచ్చి తల్లిని పలకరించి బయటకు వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు తమ కుటుంబసభ్యులకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ‘ఐ మిస్ యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రులు రాత్రంతా పట్టణంలో గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం అంతకు ముందువరకు అద్దెకున్న బద్దిపోచమ్మవీధిలోని అద్దె ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో స్థానికులు హరీశ్ తల్లి విజయకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూసేసరికి హరీశ్ దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విగతజీవుడైన కుమారుడిని చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సురేశ్ తెలిపారు. కాగా, తాను ప్రేమించిన యువతి దూరమైందనే మనస్తాపంతోనే హరీశ్ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు స్నేహితులు తెలిపారు. -
దిగులు పడొద్దు!
‘‘మంచో.. చెడో.. లవ్‌లో ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ అయినట్లు కాదు. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చేయాలి. బ్రేకప్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలి’’ అని కాజల్ అగర్వాల్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. కొంపతీసి కాజల్ ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? ఆ ప్రేమకు మధ్యలోనే ఎండ్ కార్డ్ పడిందా? అని ఆలోచించవలసిన అవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదొక తరుణంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడతారు. ప్రతి ప్రేమకథా పెళ్లి పీటల వరకూ వెళ్తుందా..? అని ప్రశ్నిస్తే సమధానం చెప్పడం కష్టమే. లవ్.. బ్రేకప్.. యూత్ రిలేషన్షిప్స్.. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘కవలై వేండాం’లో కాజల్ నటించారు. దిగులు పడొద్దు అని ఆ టైటిల్ అర్థం. ఆ సినిమాలో నటించిన అనుభవంతో కాజల్ బ్రేకప్ చిట్కాలు చెప్తున్నారు. ‘లవ్.. బ్రేకప్.. లైఫ్‌లో పాసింగ్ క్లౌడ్స్ వంటివి. ఒకవేళ లవ్‌లో పడ్డా మనం ఎవరు అనేది మరువకూడదు. మన ప్రాముఖ్యతను ఎప్పటికీ తగ్గించుకోకూడదు. లవర్ తప్ప మరో ప్రపంచం లేదనట్లుగా బతకకూడదు. అప్పుడు బ్రేకప్ అయినా పెద్దగా బాధ అనిపించదు. బ్రేకప్ నుంచి బయటకు రావడానికి ఓ నినాదం అంటూ ఏమీ లేదు’’ అని సెలవిచ్చారు కాజల్. ఇటీవల ఎక్కడ చూసినా.. కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలే. కాజల్ కూడా త్వరలో ఈ కబుర్లు చెప్పే అవకాశం వస్తుందా? అంటే ‘అందుకు చాలా టైముంది!’ అని నవ్వేశారు. -
ప్రేమలో మళ్లీ ఫెయిలైన హీరోయిన్
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార సినిమా విజయాలతో పాటు లవ్ ఎఫైర్స్లోనూ వార్తల్లో ఉంటుంది. గతంలో ప్రేమలో విఫలమైన నయనతారకు మరోసారి చేదు అనుభవం ఎదురైందట. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమలో పడినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేగాక నయన కోసం విఘ్నేష్ మతం మార్చుకున్నాడని, వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. ఏమైందో కానీ వీరిద్దరి బంధం చెడిందని, గతంలో మాదిరిగా నయనతార ప్రేమకథ మరోసారి విఫలమైనట్టు సినీ వర్గాల సమాచారం. నయనతార గతంలో కొంతమంది హీరోలతో ప్రేమాయణం సాగించింది. శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరితోనూ ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. పాపం నయనకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది. -
ప్రేమ విఫలమైందని యువకుడి వీరంగం
విశాఖపట్నం: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు భవనంపైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. వివరాలు..విశాఖ నగరంలోని అబీద్ నగర్ లో బుధవారం ఉదయం ఓ యువకుడు అపార్ట్ మెంట్ ఎక్కి కిందకు దూకేస్తానని బెదిరించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటలనా స్థలికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు వచ్చేలా చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. -
అతన్ని నెల రోజుల్లో మర్చిపోతా!
ప్రేమ చాలా ప్రమాదకరమైనది. లవ్‌లో పడితే ప్రపంచమంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక్క లవర్ తప్ప ఎవరూ ముఖ్యం కాదనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ లవర్నుంచి విడిపోతే అసలు జీవితమే ముఖ్యం కాదనిపిస్తుంది. చివరకు ఆత్యహత్య చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. కంగనా రనౌత్‌కి అయితే అలా అనిపించదు. లవ్ ఫెయిల్యూర్ని నేను చాలా తేలికగా తీసుకుంటానని కంగనా రనౌత్ చెబుతూ - ‘‘లవ్‌లో ఫెయిల్ అవ్వడం అంటే నా జీవితానికో మంచి అనుభవం దొరికినట్లే అని భావిస్తా. ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచించను. ఎందుకంటే నాకు నేనంటే బోల్డంత ప్రేమ. ఆ ప్రేమే నన్ను అవతలి వ్యక్తిని సులువుగా మర్చిపోయేలా చేస్తుంది. ఒక వ్యక్తి నుంచి విడిపోయాక అతన్ని నేను పూర్తిగా మర్చిపోవడానికి జస్ట్ నెల రోజులు మాత్రమే పడుతుంది. ప్రేమలో ఫెయిలైన ఆడవాళ్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ‘మగవాణ్ణి అతిగా నమ్మితే మోసపోక తప్పదు. అందుకే నమ్మకండి. అతన్నుంచి విడిపోయినా బతకగలగాలి. అంతకుముందుకన్నా బాగా బతకాలి. మన జీవితం చూసి మనమే గర్వపడేలా బతకాలి. ఒకవేళ నమ్మకస్తుడితో ప్రేమలో పడితే అతనితో బంధాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. అతనితో జీవితాంతం కొనసాగాలి’’ అన్నారు. -
ప్రేమలో ఓడి‘పోయాడు’
ప్యారిస్, న్యూస్‌లైన్: ఓ యువకుడు ప్రేమలో ఓడిపోయి బలవన్మరణానికి గురయ్యాడు. కోయంబత్తూరు త్యాగి కుమరన్ వీధిలో దేవరాజ్ నగల వర్క్‌షాపును నడుపుతుండేవాడు. ఈ వర్క్‌షాపులో పాలక్కాడు కుళల్మన్నం సమీపంలోని సెంగనూర్కు చెందిన ప్రదీష్ (24) పది సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నాడు. ఇతను సెంగరూర్కు చెందిన ఓ యువతితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఆపై వారి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అంగీకరించలేదు. దీంతో వారు ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రదీష్ పది రోజులు సెలవు పెట్టి సొంత ఊరికి వెళ్లాడు. వీరిద్దరూ రహస్య వివాహం చేసుకుంటారని భావించి యువతి తల్లిదండ్రులు ఆమెను వారి బంధువుల ఇంటికి పంపించేశారు. ప్రియురాలు ఎక్కడికెళ్లిందో తెలియక ప్రదీష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వారం రోజుల పాటు మతి భ్రమించిన వాడి వలే గ్రామంలో తిరిగాడు. ఈ స్థితిలో శనివారం రాత్రి ప్రదీష్కు ఫోన్ వచ్చింది. తనను మరచిపోవాలని, తన బంధువుల ఇష్టప్రకారమే నడుచుకుంటానని ప్రియురాలు తేల్చిచెప్పింది. మనస్తాపం చెందిన ప్రదీప్ ఆదివారం కోవైకు తిరిగి వచ్చాడు. వర్క్‌షాపులో ఉన్న సైనైడ్‌ను తిని తనువుచాలించాడు. చనిపోయే ముందు ప్రదీష్ తన స్నేహితుడికి ఫేస్బుక్లో మెసేజ్ పంపాడు. అందులో తాను మోసపోయానని, అమ్మాయిలను నమ్మొద్దు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని పోస్టింగ్ చేశాడు. సమాచారం అందుకున్న వెరైటీ హాల్ రోడ్డు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రదీష్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.