శ్వేత మృతదేహంశ్వేత (ఫైల్)
చౌటుప్పల్ : ఆ యువతికి అప్పటికే వివాహ నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా రోజూ వెంటపడుతున్నాడు.
ఈ క్రమంలోనే మరింతగా బరితెగించిన ఆ యువకుడు ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నాడు. తనవెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై యువతిని బలవంతంగా ఎత్తుకెళ్తుండగా.. తప్పించుకునేందుకు యువతి విశ్వప్రయత్నం చేసింది.
బైక్ పైనుంచి కిందకు దూకి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది.
జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోదనపు మదుసూధన్‌రెడ్డి కుమార్తె శ్వేత చౌటుప్పల్ మండలంలోని నేతాజీ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన తన స్నేహితురాలి ద్వారా పరిచయమైన అదే గ్రామానికి చెందిన భరత్ శ్వేతను నిత్యం ప్రేమ, పెండ్లి పేరుతో వేధించేవాడు.
తనకు ఇష్టంలేదని చెప్పినా వినిపించుకోలేదు. శ్వేతకు గత నెల 15వ వివాహ నిశ్చితార్ధం జరిగింది. కాగా గత నెల 30న ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకోసం చౌటుప్పల్ మండలంలోని అశోకా ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం సాయంత్రం బయటకు వచ్చింది. అప్పటికే భరత్ అక్కడ వేచిఉన్నాడు.
తనను పెండ్లి చేసుకోవాలని, లేదంటే ఏం చేస్తానో తెలియదంటూ శ్వేతను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో వేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి జారీ శ్వేత రోడ్డుపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడింది.
చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌కు తీసుకురాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్‌ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment