మౌనిక నుంచి వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ
కేతేపల్లి (నకిరేకల్) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెంలో శనివారం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన మంద మౌనిక ఇదే మండలంలోని కొండకిందిగూడెం గ్రామానికి చెందిన పెరిక చంటి ఇంటి ఎదుట మహిళా మండలి సభ్యులతో కలసి రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళన విషయం తెలిసి ఇంటికి తాళం వేసి మొదటి రోజే పరారైన చంటి కుటుంబ సభ్యులు రెండ్రోజులైన ఇంటికి చేరుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాలని చంటి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా అతడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
దీంతో మనస్తాపం చెందిన మౌనిక శనివారం తాను ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను వెంట ఉన్న మహిళలు గమనించి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌనికను నల్లగొండ డీఎస్పీ సుదాకర్ కలసి వివరాలు సేకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment