అమ్మా.. క్షమించు..
►నా బంగారం లేనిదే బతకలేను
►ప్రేయసి దూరమైందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
వేములవాడ:
‘అమ్మా.. నన్ను క్షమించు.. నా బంగారం(తాను ప్రేమించిన యువతి) లేనిదే బతకలేనని నీకు ముందే చెప్పా.. అందుకే మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నా మిత్రుడు మిథున్‌కు చెందిన బంగారంపై నేను యూఏఈ ఎక్సేఛేంజీలో లోను తీసుకున్నా.. ఆ లోను చెల్లించి బంగారం వాడికి అప్పగించండి’ అని సూసైడ్ నోట్ రాసి రాపర్తి హరీశ్(26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మవీధిలో జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. బద్దిపోచమ్మవీధిలో హరీశ్ తన తల్లి, ఒక సోదరితో కలిసి కొన్నేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంటిని ఖాళీ చేసి సుభాష్‌నగర్‌లోని మరో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఖాళీ చేసిన ఇంట్లో ఇంకా కొంత సామగ్రి అలాగే ఉంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు భీమేశ్వరాలయం సమీపంలోని తాను నడిపిస్తున్న టిఫిన్ సెంటర్‌లో పనులు పూర్తి చేసుకున్న హరీశ్.. ఇంటికొచ్చి తల్లిని పలకరించి బయటకు వెళ్లాడు.
రాత్రి 7.30 గంటలకు తమ కుటుంబసభ్యులకు చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ‘ఐ మిస్ యూ ఆల్’ అంటూ మెసేజ్ పెట్టడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. రాత్రి వరకూ ఇంటికి రాకపోవడంతో బంధువులు, మిత్రులు రాత్రంతా పట్టణంలో గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం అంతకు ముందువరకు అద్దెకున్న బద్దిపోచమ్మవీధిలోని అద్దె ఇల్లు తాళం పగలగొట్టి ఉండడంతో స్థానికులు హరీశ్ తల్లి విజయకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూసేసరికి హరీశ్ దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. విగతజీవుడైన కుమారుడిని చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సురేశ్ తెలిపారు. కాగా, తాను ప్రేమించిన యువతి దూరమైందనే మనస్తాపంతోనే హరీశ్ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు స్నేహితులు తెలిపారు.