కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయింది. ఇన్నేళ్లల్లో ఒక్క పవన్‌కల్యాణ్ తప్ప దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడేశారు కాజల్. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో ఆ లోటు కూడా తీరిపోయిందామెకు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి చెప్పిన విశేషాలు....
♦ ‘మగధీర’లో రామ్‌చరణ్ పక్కన రాకుమారి మిత్రవిందగా చేయడం, మళ్లీ ‘సర్దార్...’లో కూడా రాకుమారిగా చేయడం యాదృచ్ఛికం. ‘మగధీర’ ఓ ఎపిక్ స్టోరీ. కాస్త సోషియో -ఫ్యాంటసీ నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమాలో పాత్ర మాత్రం చాలా కాంటెపరరీగా సాగుతుంది. ఇప్పటి తరానికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అందుకే ఇందులోని యువరాణి అర్షికా దేవి పాత్ర గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా.
♦ పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ లవి పూర్తిగా రెండు విభిన్న మనస్తత్వాలు. కానీ ఇద్దరూ చాలా ప్రొఫెషనల్. రామ్‌చరణ్ చాలా ఔట్‌స్పోకెన్. గడగడా మాట్లాడేస్తారు. పవన్‌కల్యాణ్ మాత్రం కాస్త రిజర్వ్‌డ్. సెట్‌లో ఆయన మాట్లాడడం చాలా తక్కువ. నేనే ఆయనతో తెగ మాట్లాడేసేదాన్ని. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పవన్‌కల్యాణ్ తనకు బాగా సన్నిహితులైనవారితో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. ఇద్దరూ చాలా ప్రొఫెషనల్. యాక్టింగ్ వారి రక్తంలోనే ఉంది.
♦ గతంలో రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ‘గోవిందుడు అందరివాడే’ చిత్రాల్లో, అల్లు అర్జున్‌తో ‘ఆర్య-2’లో నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పవన్‌కల్యాణ్‌తో నా జోడీ బాగా కుదిరిందని ప్రశంసలు వస్తున్నాయి. అయినా, కెమేరా ముందు ఇద్దరు కలసి నటిస్తూ ఉంటే, కెమిస్ట్రీ అనేది అలా కుదిరిపోవాలి అంతే.
♦ ‘సర్దార్...’ సినిమాలో కాస్ట్యూమ్స్ కాస్త నన్ను కష్టపెట్టాయి కూడా. కథ ప్రకారం ఎంతైనా రాకుమారిని కదా అందుకే బరువైన కాస్ట్యూమ్స్ వాడాల్సి వచ్చింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో 7 నుంచి 8 కేజీల లెహెంగా వేసుకున్నా. చిత్రీకరణ జరుగుతున్నంత సేపు చాలా ఇబ్బందిగానే అనిపించింది. కానీ పాత్ర కోసం తప్పదు కదా!
♦ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మోత్సవం’తో మళ్లీ ఈ సమ్మర్‌లోనే కనిపించనున్నా. ఇక హిందీలో ‘దో లఫ్జోంకీ కహానీ’ సినిమాలో అంధురాలిగా నటించాను. చెప్పాలంటే నా కెరీర్‌లోనే చాలెంజింగ్ రోల్ ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నా. అంధురాలిగా యాక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ముంబైలో మా ఇంటి దగ్గరలోనే ‘జేవియర్ సెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజెడ్’ అనే స్కూల్‌కు వెళ్లి అక్కడ ఉన్న వాళ్లను గమ నించా. చాలా కష్టపడి మనసుపెట్టి చేసిన పాత్ర అది.