అందుకు మరి కొంతకాలం ఆగాల్సిందే!
సెలబ్రిటీ తారలకు వ్యక్తిగతంగా ఎక్కువగా చిక్కొచ్చేదెక్కడంటే వివాహం విషయంలోనే. దీనికి వేరే అర్థాలు తీసేరు.ఇక్కడ చెప్పేదేమంటే ప్రముఖ నాయికల మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా పెళ్లి వార్తలు తెరపై కొచ్చి హల్‌చల్ చేస్తుంటాయి. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే నటి కాజల్‌అగర్వాల్ కూడా దీన్ని ఎదుర్కోకతప్పలేదు. మరో విషయం ఏమిటంటే ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో మునిగి తేలుతుండడంతో కాజల్‌కు ఈ బెడద ఎక్కువైందనే చెప్పాలి. ఈ ఉత్తరాది బ్యూటీ ముంబైకి చెందిన ఒక వ్యాపార వేత్త ప్రేమలో పడ్డారనే ప్రచారం ఆ మధ్య గుప్పుమంది.
ఆయనతో త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం హోరెత్తింది. అందుకు పూజలు, పరిహారాలు చేసినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ విషయాలపై కాజల్ రియాక్ట్ అవ్వకపోయినా ఆమె చెల్లెలు ఖండించడానికి తంటాలు పడ్డారు. కొంత కాలం కాజల్ పెళ్లి ప్రచారం సద్దుమణిగినా ఇటీవల మళ్లీ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఐదారు చిత్రాలు చేతిలో ఉండడంతో కాజల్ పెళ్లిని మరోసారి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దీని గురించి స్పందించిన కాజల్‌అగర్వాల్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుండడంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ తరుణం తన కోసం మరి కొంత కాలం ఆగాల్సిందేనని కాజల్ పేర్కొన్నారు.