కాలభైరవ
‘‘మనం చేసే పని మనకు నచ్చితే ఇతరులకు కూడా నచ్చుతుందని నమ్ముతాను. ఈ సినిమాకు నేను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నాకు సంతృప్తినిచ్చింది. ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు గాయకుడు, సంగీతదర్శకుడు కాలభైరవ. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించారు. ఈ సినిమాతో కీరవాణి మరో తనయుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారారు. ‘మత్తు వదలరా’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాలభైరవ చెప్పిన విశేషాలు.
► చిన్నప్పటి నుంచి సంగీత దర్శకుడు కావాలన్నదే నా కల. నా వాయిస్ కూడా బాగుండటంతో పాటలు పాడాను. ప్లే బ్యాక్ సింగర్‌గా దాదాపు 30 పాటలు పాడాను. ‘బాహుబలి 2’ చిత్రంలోని ‘దండాలయ్యా’ పాట నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలోని ‘పెనివిటీ’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది వరకు నేను ‘బాహుబలి: ది లాస్డ్ లెజెండ్స్’ యానిమేషన్ వెబ్ సిరీస్‌కు సంగీతం అందించాను. కానీ సంగీత దర్శకుడిగా ఇదే నా మొదటి సినిమా.
► తొలి సినిమా అంటే ఎవరైనా నిరూపించుకోవాల్సిందే. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా నేను ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ప్రముఖ దర్శకుడు కీరవాణిగారి అబ్బాయి ‘మత్తు వదలరా’ సినిమాకు సంగీతం అందించాడు. ఎలాంటి సంగీతం ఇచ్చాడు? అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉంటాయి. ఆ ఒత్తిడి నాపై ఉంటుంది. చిత్రబృందం ఇచ్చిన పూర్తి సహకారంతో ఈ ఒత్తిడిని నేను ఫీల్ కాలేదు. నా వరకు నేను వంద శాతం కష్టపడ్డాను. ఐదేళ్ల తర్వాత కాలభైరవ ఎలాంటి సంగీతాన్నైనా ఇవ్వగలడని ప్రేక్షకులు మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను. అందుకోసం కష్టపడతా.
► ఐదారేళ్లుగా నాన్నగారితోనే కలిసి పని చేస్తున్నాను కాబట్టి ఆయన ప్రభావం నాపై ఉంటుంది. ఈ సినిమా కోసం ఆయన దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నాను. ముఖ్యంగా ఎమోషన్‌ను ఎలా క్యాప్చర్ చేయాలో నేర్చుకున్నాను. ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తే ఎక్కడో హిందీ టచ్ వినిపిస్తుంది. కానీ నాన్నగారు ఏ భాషలోని సినిమాలకు సంగీతం అందించినా అది ఆ నేటివిటీలో పరిపూర్ణంగా ఉంటుంది. నాన్నగారి పాటలంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారు పాటలిచ్చిన సినిమాల్లో ‘ఒకరికొకరు’ (2003) నా ఫేవరెట్. ఇండస్ట్రీ విషయాలు కాకుండా నాన్నగారు మాకు కొన్ని విషయాలు చెబుతుంటారు. ఏ విషయంలోనైనా మన బుద్ధి చాలా ముఖ్యమని చెప్పారు. నాన్నగారి పేరు నిలబెట్టడానికి కష్టపడతాను.
► ‘మత్తు వదలరా’లో హీరో డెలివరీ బాయ్. ఓ డెలివరీ ఇవ్వాల్సిన సమయంలో చిన్న పొరపాటు చేస్తాడు. అది పెద్ద సమస్యకు దారి తీస్తుంది. అప్పుడు ఆ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? ఇందుకు అతని స్నేహితులు ఎలా సహాయం చేశారు? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంటుంది. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ తక్కువ ఉన్నా మ్యూజిక్ విషయాన్ని ఆడియన్స్ బాగానే అబ్జర్వ్ చేస్తారు. ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేశాం. స్క్రిప్ట్‌లో బలవంతంగా పాట పెడితే కథకు అన్యాయం చేసినవాళ్లం అవుతాం.
► నేను సంగీత దర్శకుడిగా, నా బ్రదర్ శ్రీసింహా హీరోగా ఒకే సినిమాతో పరిచయం అవుతామని కలలో కూడా ఊహించలేదు. చిన్నతనం నుంచే శ్రీసింహాకు నటన అంటే ఆసక్తి. నాకు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ అవకాశం గొప్పదని నమ్మే వ్యక్తిని నేను. ఈ సినిమాలో అందరికంటే చివర్లో జాయిన్ అయిన వ్యక్తిని నేనే. నిర్మాత చెర్రీగారు నాకు అవకాశం ఇచ్చారు. ‘మైత్రీ’ రవిగారు సహాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment