టైటిల్ : ఎంఎల్ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయ్)
జానర్ : కమర్షియల్ ఎంటర్‌టైనర్
తారాగణం : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్, 30 ఇయర్స్ పృథ్వీ, మనాలీ రాథోడ్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్
నిర్మాత : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టీజీ విశ్వ ప్రసాద్
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఎంఎల్‌ఎ. పటాస్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. రచయిత ఉపేంద్ర మాధవ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో చాలా కాలం తరువాత కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించాడు కళ్యాణ్ రామ్. మరి పొలిటికల్ ఎంటర్‌టైనర్ కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో సక్సెస్ గా నిలిచిందా..? ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా విజయం సాధించాడా..?
కథ :
గాడప్ప (రవికిషన్) అనంతపురం జిల్లా వీరభద్రపురం ఎంఎల్‌ఎ. తరతరాలుగా గాడప్ప వంశం వాళ్లే అక్కడ ఎంఎల్‌ఎగా ఎన్నికవుతూ వస్తుంటారు. గాడప్పపై మీద ఒక్కసారైన విజయం సాధించాలన్న కసితో నాగప్ప(జయ ప్రకాష్ రెడ్డి) గాడప్ప మీద ఎన్నికల్లో తలపడుతూనే ఉంటాడు. ఇక మన హీరో కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) మంచి లక్షణాలున్న అబ్బాయ్. చెల్లెలు(లాస్య) ప్రేమించిన అబ్బాయికి వేరే పెళ్లి జరుగుతుంటే పెళ్లి పీటల మీదనుంచి లేపుకొచ్చి మరీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాడు. (సాక్షి రివ్యూస్) తమకు కూడా చెప్పకుండా చెల్లి పెళ్లి చేసినందుకు కళ్యాణ్ తండ్రికి కోపం వస్తుంది. కళ్యాణ్‌తో సహా చెల్లిని కూడా ఇంట్లోనుంచి గెంటేస్తాడు. అలా బెంగళూరు చేరిన కళ్యాణ్‌కు అక్కడ ఇందు(కాజల్ అగర్వాల్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ఇందుతో ప్రేమలో పడిన కళ్యాణ్ ఆమె కంపెనీ సమస్యల్లో ఉంటే బయటపడేసేందుకు సాయం చేస్తాడు. కానీ అదే సమయంలో ఇందు ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. ఆమె గతం తెలుసుకున్న కళ్యాణ్ ఏం చేశాడు..? ఇందుకు వీరుభద్రపురం ఎంఎల్‌ఎ గాడప్పకు సంబంధం ఏంటి? కళ్యాణ్ ఎంఎల్‌ఎగా పోటి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ తన ఇమేజ్‌కు, బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కమర్షియల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనదైన నటనతో కళ్యాణ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో కళ్యాణ్ రామ్ నటన కంటతడిపెట్టిస్తుంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యాన్స్ లు ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్ లోనూ పర్ఫెక్షన్ చూపించాడు. కాజల్ అగర్వాల్‌కు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. (సాక్షి రివ్యూస్)ఇందుగా అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. విలన్ గా రవికిషన్ తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు. గాడప్ప పాత్రలో రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర ఛాయలు కనిపిస్తాయి. చాలా కాలం తరువాత బ్రహ్మానందం కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. లాయర్ పట్టాభిగా బ్రహ్మీ అలరించాడు. ఇతర పాత్రలో వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళీ, 30 ఇయర్స్ పృథ్వీ,ప్రభాస్ శ్రీనులు నవ్వించే ప్రయత్నం చేశారు.
విశ్లేషణ :
దర్శకుడిగా తొలి ప్రయత్నానికి ఉపేంద్ర మాధవ్ పక్కా ఫార్ములా కమర్షియల్ సినిమాను ఎంచుకున్నాడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్ల కాన్సెప్ట్ తో రూపొందిన ఎంఎల్‌ఎతో నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథతో సంబంధం లేకుండా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ సమయానికి గాని కథలోకి ఎంటర్ కాలేదు. హీరో ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యేందుకు చేసే ప్రయత్నాలు ఇంకాస్త ఎలివేట్ చేసుంటే బాగుండేదనిపించింది. (సాక్షి రివ్యూస్)మణిశర్మ సంగీతం పరవాలేదు. పాటలు విజువల్ గా బాగున్నాయి. నేపథ్యం సంగీతంలో మణిశర్మ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్, కాజల్
కామెడీ
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరి
బోర్ కొట్టించే కొన్ని సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment