కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, ‘అల్లరి’ నరేశ్, కిరణ్ రెడ్డి, విశ్వప్రసాద్, భరత్ చౌదరి, ఉపేంద్ర మాధవ్
‘‘కాంబినేషన్ కంటే కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలంటే ఇష్టం. అలాంటి వారిలో ‘ఎంఎల్‌ఏ’ చిత్రనిర్మాతలు ముందుంటారు. తప్పకుండా వీరు పెద్ద నిర్మాతలు అవుతారు’’ అన్నారు కల్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఎంఎల్‌ఏ’. టి.జి. విశ్వప్రసాద్ సమర్పణలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘పటాస్’ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో ‘ఎంఎల్‌ఏ’ కథ విన్నప్పుడూ అంతే ఎగ్జయిట్ అయ్యాను.
ఈ సినిమాలో ఉపేంద్ర నన్ను కొత్తగా చూపించాడు. ‘పటాస్, ఇజం’ సినిమాలు చేస్తున్నప్పుడు ఎంత బాగా ఫీలయ్యానో.. ఈ సినిమాకూ అలాగే ఫీలయ్యాను. కొత్త దర్శకుడిని గైడ్ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ది భార్య, భర్తల బంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్‌లో బెస్ట్ కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్లగారు. కాజల్‌తో రెండో చిత్రమిది. ఇప్పటివరకూ నేను పధ్నాలుగు సినిమాలు చేస్తే.. తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డెడికేషన్’’ అన్నారు.
‘‘రియల్ లైఫ్‌లో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు. కానీ, ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా డైరెక్టర్ అవడం ఎంత కష్టమో తెలుసు. ఉపేంద్ర నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసు. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ‘‘తన బాధ్యతను ఎక్కువగా ప్రేమించే డైరెక్టర్స్‌లో ఉపేంద్ర ఒకరు. సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించగల మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మగారు’’ అన్నారు బ్రహ్మానందం. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి.సురేశ్ బాబు.
‘‘కల్యాణ్ రామ్‌గారికి ‘ఎంఎల్‌ఏ’ టైటిల్ చక్కగా యాప్ట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. ‘‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలోనే ఉపేంద్ర ఈ కథ చెప్పారు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో కల్యాణ్ రామ్. చేతికి గాయమైనా కమిట్‌మెంట్‌తో సినిమాను పూర్తి చేశారు’’ అని కిరణ్ రెడ్డి అన్నారు. ‘‘కథ వినగానే సినిమా చేస్తున్నాం అన్నారు కల్యాణ్ రామ్‌గారు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ అయింది. మణిశర్మగారు పాటలు ఎంత బాగా చేశారో.. రీ–రికార్డింగ్ అంత కంటే బాగా చేశారు’’ అన్నారు ఉపేంద్ర మాధవ్. పోసాని, రవికిషన్, కోన వెంకట్, వీఎన్ ఆదిత్య, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment