గాయపడ్డ కమల్ | Kamal Haasan injured in shooting | Sakshi
Sakshi News home page

గాయపడ్డ కమల్

Published Sun, Aug 18 2013 1:23 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

గాయపడ్డ కమల్ - Sakshi

గాయపడ్డ కమల్

 సినిమా కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. అలాంటివారిలో కమల్‌హాసన్ పేరుని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఓ పాత్రకు న్యాయం చేయడం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి వెనుకాడరు కమల్. అందుకు బోల్డన్ని ఉదాహరణలున్నాయి. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో అప్పు పాత్రను పండించడం కోసం మోకాళ్లను  వెనక్కి మడిచేసి, ఆ మోకాళ్లకు షూస్ వేసుకుని నటించారాయన. శరీరాన్ని ఎంత హింసపెట్టి ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. పోరాట దృశ్యాల్లో సైతం కమల్ రిస్కులు తీసుకుంటుంటారు. ఫలితంగా గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఇలాంటి ప్రమాదకర పోరాటాలను ఎంజాయ్ చేస్తానని, అవి చేస్తున్నప్పుడు లభించే కిక్కే వేరని ఇటీవల ఓ సందర్భంలో కమల్ పేర్కొన్నారు. తాజాగా ‘విశ్వరూపం 2’ కోసం మరోసారి గాయపడ్డారు కమల్.
 
  ఈ చిత్రం కోసం ఇటీవల కొడెకైనాల్‌లో రిస్కీ ఫైట్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో కమల్ గడ్డానికి గాయమైంది. చిన్నదేలే అని తేలికగా తీసుకుని, షూటింగ్ కంటిన్యూ చేసే గాయం కాదది. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి సూచించారట. ఆ తర్వాత మళ్లీ ఈ రిస్కీ ఫైట్ షూటింగ్‌లో పాల్గొంటారు కమల్. ‘విశ్వరూపం’కి సీక్వెల్‌గా తీస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకున్నారట. కానీ గాయం కారణంగా షూటింగ్‌కి ఆటంకం ఏర్పడటంతో దీపావళికి విడుదలవుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అనుకున్న సమయానికి విడుదలైతే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? లేట్ అయినా ఈ చిత్రం లేటెస్ట్‌గా ఉంటుందని మాత్రం ఊహించవచ్చు. ఇందులో కమల్ సరసన పూజాకుమార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇంకా శేఖర్‌కపూర్,ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement