
కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు– ఎంత మంచి కారణానికి పట్టినా.భారత దేశంలో కన్సిస్టెంట్‌గా ఉన్న ఒకే ఒక్క విషయం– ఆకలి. స్వాతంత్య్రం వచ్చాక ఇరవై, ముప్పై ఏళ్లకు జనాభా పెరిగిందని అందరూ అన్నారు కానీ పెరిగింది జనాభా కాదు ఆకలి. పేదరికం. సంపద అతి స్వల్పమంది చేతుల్లోకి వెళ్లిపోయింది. ఉపాధి అత్యల్పం అయిపోయింది. కనుక పని దొరకని వాళ్లంతా పెరిగిపోయిన జనాభా కింద జమ కట్టబడ్డారు. ఈ సమస్య గురించి పాలకులకు శ్రద్ధ లేదు... ఒక వేళ ఏం చేయాలనుకున్నా ఇంత పెద్ద దేశంలో ఏ పనీ తొందరగా తెమలదు. వ్యవస్థ విఫలమైన చోట సమాంతరమైన వ్యవస్థ ప్రాణం పోసుకుంటుంది. డబ్బు ఎక్కువ ఉన్న చోట దీనికి తేజం ఎక్కువ. ‘ఆర్థిక రాజధాని’ బొంబాయిలో అండర్ వరల్డ్ పురుడు పోసుకోవడానికి కారణం అదే. అందరు పేదవాళ్లు ఊరికే ఉండరు. ఆకలేసిన వాళ్లందరూ కడుపుకు తడిబట్ట చుట్టుకుని పడుకోరు. ఒకడు తెగిస్తాడు. వాడు తన అవసరాల కోసమో, అవసరమైన జనం కోసమో, నిజంగా తన మనుషులు అనే భావం వల్లో కొందరికి సాయం చేస్తాడు.అలాంటి వాడు బయటి సమాజానికి ఎలా కనిపించినా తన సమాజానికి నాయకుడిలా కనిపిస్తాడు. ఈ సినిమాలో కమలహాసన్ అలాంటి నాయకుడే. ఖద్దరు పంచె, తెల్ల చొక్కా ధరించిన రాబిన్‌హుడ్. పేదలకు పెద్ద దిక్కు.
తండ్రిది మద్రాసు. యూనియన్ లీడర్. కాని ప్రభుత్వం అతణ్ణి కాల్చి పారేసింది. ఆ తండ్రి లక్షణం, తిరగబడే స్వభావం ఉన్న కమలహాసన్ బొంబాయి పారిపోతాడు. అలా పారిపోయినవాళ్లు ఎక్కడకు చేరతారు? ఆసియాలోనే అతి పెద్ద మురికివాడైన ధార్వికి చేరుతారు. కమలహాసన్ అక్కడ ఒక ముస్లిం ఇంటిలో నీడ పొందుతాడు. అక్కడే పెరుగుతాడు. ‘అటు సరుకు ఇటు చేర్చడం’ అనే విద్య ఊపిరి పోసుకుంటున్న ఆ రోజుల్లో అందులో దిగుతాడు. సముద్రం చాలా అఘాతాలతో మాత్రమే కాదు నేరాలతో కూడా నిండి ఉంటుంది. ముంబై తీరం తన గర్భంలో ఎన్నో నేరాలను దాచుకుని ఉంటుంది. కమల హాసన్ ఆ నేర ప్రపంచంలోకి అడుగు పెడతాడు. సినిమా ప్రారంభంలోనే దర్శకుడు ఒక ప్రశ్నను అడిగిస్తాడు –‘ఈ పని మంచిదా... చెడ్డదా’. దానికి జవాబు దర్శకుడే చెప్పిస్తాడు –‘నలుగురికి మేలు చేసే పని మంచిదే’. ఈ స్పష్టత ఇచ్చాక కమలహాసన్ మురికివాడ ప్రజల కోసం ఏదో ఒక తెగింపు చేస్తూనే ఉంటాడు. అందులో ఒకటి– వీరోచిత ప్రతీకారంతో నిండినది– తమను పీడిస్తున్న ఇన్స్‌పెక్టర్‌ని చంపడం. తన ప్రాంతాన్ని కబ్జా చేయాలనుకున్న సేట్‌ని తన్ని తగలేయడం. ఆడవాళ్లకు రక్షణ ఇవ్వడం. సాయం కోరి వచ్చే వాళ్లకు సాయం చేయడం. గణేశ్ మండపాల్లో వినాయక చవితినాడు చేతికి అందిన నోట్లను జనం మీదకు విసరడం. కమల్ ఇప్పుడు నాయకుడు. ముఖ్యంగా ఊరుగాని ఊరులో, దక్షిణాది వారని మూలకు నెట్టివేయబడ్డ తమిళులలో వారి సమస్యలు తీర్చే ఆపద్బాంధవుడు. వాళ్లు తమకు ఏ కష్టం వచ్చినా వ్యవస్థను ఆశ్రయించరు. ఈ సమాంతర వ్యవస్థనే ఆశ్రయిస్తారు. తక్షణమే జవాబు దొరికే దర్బారు అది.
కాని కింద నీటిలో ఉండే చేప అక్కడక్కడే తిరుగాడాలి. పై నీటికి ఎగబాకితే అక్కడ మొసళ్లుంటాయి. షార్క్‌లు కాచుకుని ఉంటాయి. బస్తీ స్థాయి నాయకుడి నుంచి కమలహాసన్ ఇంకా ఎదుగుదామని చూస్తాడు. షిప్‌యార్డ్ మీద జెండా ఎగరేయాలని చూస్తాడు. కాని అప్పటికే అక్కడ పాతుకుపోయి ఉన్నవారు తన ప్రయోజనాలకు అడ్డు తగిలితే ఊరుకుంటారా?కమలహాసన్ భార్య తుపాకీ బుల్లెట్లు దిగబడి మరణిస్తుంది.అంతేనా?ఇలాంటి పనుల వల్లే చెట్టంత కొడుకు మరణిస్తాడు.సొంత మనుషులు పోయినప్పుడు ప్రాణంలా చూసుకునే జనం ప్రాణం పోస్తారు. కమలహాసన్ తట్టుకుని నిలబడగలడు. కాని అతని కూతురు? ఆమె తండ్రిని అసహ్యించుకుంటుంది. ఈ పనులు మానేయమంటుంది. చివరకు అతణ్ణే విడిచిపెట్టి వెళ్లిపోతుంది.చుక్కానిని పారేసి ఓడ ఎక్కిన మనిషి గమ్యం లేని ఏదో ఒక వడ్డుకు చేరుకోవాలిగాని ఎక్కిన తీరానికి కాదు. ఇప్పుడు కమలహాసన్ చేస్తున్నది పులి మీద సవారి. దిగలేడు. వెనక్కి రాలేడు.అప్పటికే అతడి నేర ప్రపంచం పెద్దదైపోయింది. పెద్దవాడైపోయాడు.కాని వ్యవస్థ కూడా చాలా గమ్మత్తుది. అది తనకు ప్రయోజనాలు నెరవేరే వరకూ సమాంతర వ్యవస్థలను అంగీకరిస్తుంది. తనను కూడా దాటేస్తే.. తన చేతుల్లో లేనంత స్థాయికి చేరుకుంటే అప్పుడు బూజు పట్టిన తుపాకీని తళతళ మెరిపిస్తుంది. ఇప్పుడు కమలహాసన్ మీద ఒక పోలీసు ఆఫీసరు పులిలా వచ్చి పడతాడు. అతడి మనుషులను లోపలేస్తాడు. వ్యాపారాలు బంద్ చేయిస్తాడు. కమల హాసన్‌ను వెంటాడతాడు. చివరకు కమలహాసన్ లొంగిపోతాడు.
కాని ఇలాంటి మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటుందా?ఏమీ ఉండదు.కమలహాసన్ కోర్టు నుంచి నిర్దోషిగా బయటపడ తాడు.ఇది ప్రకృతి అంగీకరించని నియమం. కత్తి పట్టినవాడు కత్తితోనే పోవాలి. కథ సుఖాంతమైన కమలహాసన్ ఏ ఇన్‌స్పెక్టర్‌నైతే తాను చంపాడో ఆ ఇన్‌స్పెక్టర్ కొడుకు చేతిలోనే హతమవుతాడు.కథ ముగుస్తుంది.ఎలాంటి కథ ఇది? ఎంత రోమాంచితమైనది. జీవితంలోని సకల ఆటుపోట్లను చూసినది. ఒక మనిషి తెగబడి చూడగలిగిన జీవితాన్నంతా చూపించగలిగినది.ఇది కొందరి జీవితం.ఎంతో మందికి పనికి వచ్చిన కొందరి జీవితం.కాని వ్యవస్థను దాటిన జీవితం ఇల్లాగే ముగుస్తుంది.ఇవాళ దేశం అభివృద్ధి చెందింది. ఉపాధి పెరిగింది. ఆకలి అలాగే ఉంది. సముద్రం ఒడ్డున లైట్‌హౌస్ వ్యవస్థ అంగీకారం కలిగిన మార్గాన్ని చూపిస్తుంటుంది.కాని ఈ ఆకలి నశించకపోతే ఇదిగో ఇవాళ, రేపు కూడా ఒక దివిటీ నేరానికి దారి చూపిస్తూనే ఉంటుంది. ఒక కాలంలో వెలిగి ఆరిపోయిన దివిటీ కథ– ఈ కథ– నాయకుడు.
నాయకన్
1987లో మణిరత్నం తీసిన క్లాసిక్ ‘నాయకన్’. తెలుగులో ‘నాయకుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఒక స్ట్రయిట్ ఫిల్మ్ చూసిన అనుభూతి కలగడానికి కారణం స్రవంతి మూవీస్ వారు పెట్టిన శ్రద్ధ కావచ్చు. రాజశ్రీ ప్రతిభ కావచ్చు. అన్నింటికి మించి మొదటి ప్రశంస చేయాల్సింది ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంనే. కమల్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ ఎంతో ప్రతిభావంతమైనది. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ ఒక్క సినిమాలో ఎస్.పి చూపిన వేరియేషన్సే పెద్ద పాఠాలు. ఇది ముంబైలో స్థిరపడ్డ తమిళ అండర్ వరల్డ్ డాన్ ‘వరదరాజ ముదలియార్’ జీవితం ఆధారంగా తయారైంది. సినిమా చూసిన వరద రాజ ‘మరీ అంత మంచివాణ్ణి కానులే’ అని మణిరత్నంతో చిన్న చిర్నవు నవ్వాడట. డాన్ జీవితాన్ని, హింసను గ్లోరిఫై చేసిందనే విమర్శ ఈ సినిమా ఎదుర్కొన్నా జనం పట్టించుకోలేదు. ‘గాడ్‌ఫాదర్’ ప్రభావం దీని మీద ఉన్నా మణిరత్నం అదేం లేదని అంటాడు. ఇందులోని చాలా సన్నివేశాలు కాలానికంటే ముందే తీసినవి. పిసి శ్రీరామ్ పనితనం గమనించి చూడాలి తప్ప చెప్పలేం. ఇందులోని కొన్ని షాట్స్‌ను పోలినవి ‘శివ’లో చూస్తాం. శరణ్యకు ఇది తొలి సినిమా. ఇళయరాజా చేసిన ఆర్.ఆర్, పాటలూ గొప్పవి. ఇందులో ‘నీ గూడు చెదిరింది’... ఇప్పటికీ కామెడీ సన్నివేశాల్లో ఉపయోగిస్తుంటారు. కమలహాసన్‌కు ఈ సినిమా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చింది. కొడుకు చచ్చిపోయినప్పుడు కమల్ ఏడ్చే సన్నివేశం గొప్ప నటనగా చెప్పుకున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలన్న రజనీకాంత్ తపన చాలా ఏళ్లకు ‘కబాలి’తో గాని తీరలేదు.
Comments
Please login to add a commentAdd a comment