తప్పని పరిస్థితుల్లో దర్శకుడిగా..!
కమల్‌హాసన్‌లో మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రం చెప్పాలంటే ‘విశ్వరూపం’కి మించిన మంచి ఉదాహరణ లేదు. ఇలా నటనతో పాటు దర్శకత్వం మీద కూడా అవగాహన ఉండటం మంచి విషయమే. ఒక్కోసారి దర్శకుడికి కుదరకపోయినా, దర్శకత్వం వహించే పరిస్థితుల్లో ఆ దర్శకుడు లేకపోయినా.. అప్పుడు వెంటనే రంగంలోకి దిగొచ్చు.
కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ విషయంలో అదే జరిగింది. ఈ చిత్రంలో కమల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం ఇటీవల ఈ చిత్రబృందం లాస్ ఏంజిల్స్ వెళ్లింది. మొదటి రోజు షూటింగ్ బాగానే జరిగింది. నాలుగో రోజు చిత్రదర్శకుడు టి. రాజీవ్‌కుమార్ అస్వస్థతకు గురి కావడంతో కమల్ నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది.
ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ రాజీవ్ పరిస్థితి ఎలా ఉందనే విషయానికి వస్తే.. లైమ్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారని డాక్టర్లు నిర్ధారించారట. ఐరోపా-ఉత్తర అమెరికాలో వచ్చే అరుదైన ఇన్ఫెక్షన్ ఇది అని సమాచారం. లాస్ ఏంజిల్స్‌లోని ది బెస్ట్ అనదగ్గ ఆస్పత్రిలో చేర్చి, రాజీవ్‌కు మెరుగైన చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు షూటింగ్‌కు ఆటంకం కలగనివ్వకుండా కమల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.