
కమల్ సినీజీవితంపై ఓ పుస్తకం
ఇటీవలే షష్టి పూర్తి చేసుకున్న అయిదు దశాబ్దాల సినీ అనుభవజ్ఞుడు కమలహాసన్. ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు కెమేరా ముందు, వెనుక ఎదురైన అనుభవాలు అనేకం. ఆయన జీవిత కథ ఇప్పటికీ సాధికారికంగా పుస్తక రూపంలో రాలేదు. అయితే, ఇప్పుడు ఆయన సినీ జీవిత కృషిని ప్రస్తావిస్తూ ఒక పుస్తకం సిద్ధమైంది. ‘సిటిజన్ కె’ పేరిట కమలహాసన్ సినీ జీవిత చరిత్ర పుస్తకంగా రానుంది. దీర్ఘకాలంగా కమలహాసన్‌కు మిత్రుడూ, అభిమాని, స్వయంగా చిత్ర రూపకర్త, జర్నలిస్టు అయిన హరిహరన్ ఈ పుస్తకం రాస్తున్నారు.
‘ప్రసాద్ ల్యాబ్స్’ వారు నిర్వహిస్తున్న ప్రసాద్ ఫిల్మ్ అకాడెమీకి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ఆయన జీవిత కథలో పూర్తిగా కమల్ సినీ జీవితాన్ని అందిస్తున్నారు. ఈ విషయంపై కమల్ స్పందిస్తూ, ‘‘నా సినీ కృషిని చాలాకాలంగా హరిహరన్ సన్నిహితంగా పరిశీలిస్తున్నారు. ఆ రకంగా ఈ రచన చేసే సాధికారికత ఆయనకుంది. అయితే నా వ్యక్తిగత జీవితంలోని హాట్ హాట్ అంశాలను తెలుసుకోవాలనుకొనేవారిని మాత్రం ఈ పుస్తకం నిరాశపరుస్తుంది’’ అని నవ్వేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి రాస్తే, కొందరిని అనివార్యంగా నొప్పించాల్సి వస్తుంది. అది సరైన పని కాదు. కాబట్టి, నా గురించి రాయడాన్ని నేను వ్యతిరేకిస్తుంటాను.
అయితే, ఇది నా సినీ కృషి మీద పుస్తకం కాబట్టి, ఒప్పుకున్నా’’ అని ఈ నిత్యనూతన నట, దర్శకుడు వివరించారు. అన్నట్లు, కమల్ జీవితకథను ఆయన మాజీ భార్య సారిక పుస్తక రూపంలో తెస్తున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. కమల్ మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘సారిక అలాంటి పుస్తకం ఏమీ రాయడం లేదు. కాబట్టి, దాన్ని నేను ఆపడమనే ప్రసక్తే లేదు. అవతలివాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఎలా గౌరవించాలో మా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని కమలహాసన్ అన్నారు.