నేనేమి చేశాను తప్పు?
నేనేమి చేశాను తప్పు. ఏమిటీ ఇది పాటలోని చరణం అనుకుంటున్నారా? కాదండీ విశ్వనటుడు కమలహాసన్ వ్యక్తం చేసిన ఆవేదనపు వ్యాఖ్యలు. ఆయన అంతగా బాధపడాల్సిన అవసరమేమొచ్చిందనేగా మీ ఆసక్తి. కమల్ ఇటీవల తరచూ తన భావాలను వ్యక్తం చేయడానికి ట్విట్టర్‌ను సాధనంగా వాడుకుంటున్నారు. ఇటీవల నెలకొన్న రాజకీయపరిణామాల గురించి ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక ఒక విప్లవంలా సాగిన విద్యార్థుల జల్లికట్టు పోరాటానికి మద్దతు తెలపడానికి ట్విట్టర్‌ను వాడుకున్నారు.రాజకీయవేత్త సుబ్రహ్మణ్యంస్వామి ఆరోపణలను ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టారు. ఇలా తరచూ రాజకీయాల గురించి తన వాదనను వినిపించడంతో ఆయన రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది.
నిజానికి కమలహాసన్ ను రాజకీయరంగప్రవేశం చేయాలన్న ఒత్తిడి చాలా కాలంగానే ఉంది. అయితే రాజకీయాలు తనకు సరిపడవని ఆయన తన నిర్ణయాన్ని పలుమార్లు స్పష్టంగా వెల్లడించారు. తాజాగా జల్లికట్టు పోరాటంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను ఖండిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతే కాదు ఇటీవల బీజేపీ నేత ఫొన్ రాధాకృష్ణన్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కమల్ రాజకీయరంగప్రవేశం చేయాలన్న ఒత్తిడి మరో సారి పెరుగుతోంది. దీనిపై స్పందించిన కమలహాసన్ మీకు అండగా నిలుస్తున్నా? నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు? నేనేమి చేశాను తప్పు. ఇది నన్ను చాలా వేదనకు గురిస్తోంది అని కాస్త ఘాటుగానే స్పందించారు.
ఈ విషయం అటుంచితే శనివారం తన కూతురు శ్రుతిహాసన్ పుట్టిన రోజు కావడంతో ట్విట్టర్ ద్వారా కమల్ శుభాకాంక్షలు అందించారు. అందులో ఆయన పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు. నీ కార్యాచరణ బాగుంది. ఇది ఆరంభం మాత్రమే. అది మనసులో ఉంచుకో. లవ్యూ పాప అని పోస్ట్ చేశారు.