డైలాగ్ రైటర్‌గా కంగనా
డైలాగ్ రైటర్‌గా కంగనా
Published Mon, Dec 23 2013 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘‘నేను మైనపు ముద్దలాంటిదాన్ని. ఓ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతాను’’ అని పలు సందర్భాల్లో కంగనా రనౌత్ పేర్కొన్నారు, హాట్ గాళ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కంగనా ‘తను వెడ్స్ మను’తో పక్కింటి అమ్మాయిలా ఉందని కూడా అనిపించుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘రజ్జో’లో బ్రహ్మాండంగా నటించారు. కేరక్టర్ ఇన్‌స్పయిర్ చేస్తే చాలు... ఏమైనా చేయడానికి వెనకాడరు కంగనా. ప్రస్తుతం ‘క్వీన్’లో తాను పోషిస్తున్న పాత్ర ఈ బ్యూటీ క్వీన్‌కి బాగా నచ్చింది.
దాంతో ఆ పాత్రకు డైలాగులు తానే రాస్తే బాగుంటుందని భావించారామె! అంతేకాదు... ఆ పని చేసి చూపించారు కూడా! దీనిపై చిత్రదర్శకుడు వికాస్ బాల్ మాట్లాడుతూ - ‘‘ఇందులో కంగనా ఒక చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. బిడియం, అమాయకత్వం కలగలసిన పాత్ర ఇది. ఈ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుందో కంగనా బాగా అవగాహన చేసుకుంది.
దాంతో డైలాగ్స్ రాసింది. తను రాసిన డైలాగ్స్ కథ మరింత మెరుగవడానికి దోహదపడ్డాయి’’ అని చెప్పారు. కేవలం నటనే కాకుండా సినిమాకి సంబంధించిన ఇతర శాఖలంటే కూడా కంగనాకి ఇష్టం. అందుకే, త్వరలో షూటింగ్స్ నుంచి ఓ చిన్న బ్రేక్ తీసుకుని విదేశాలకెళ్లి, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ కోర్స్ కూడా చేయాలనుకుంటున్నారు కంగనా. సో.. భవిష్యత్తులో కంగనా మెగాఫోన్ పట్టినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు మరి!.
Advertisement
Advertisement