
సంపూర్ణ రామాయణం చిత్రంతో నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై పలు విజయవంతమైన చిత్రాలు తీశారు.
బెంగళూరు : ప్రముఖ కన్నడ నిర్మాత ఎం భక్తవత్సల (84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమవుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. భక్తవత్సల మృతి పట్ల కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి సంతాపం ప్రకటించారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుడిగా సేవలందించిన భక్తవత్సల 1971లో వచ్చిన సంపూర్ణ రామాయణం చిత్రంతో నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సంధ్యారాగ, సంస్కార సినిమాలతో నిర్మాతగా గుర్తింపు పొందారు. ఆపై పలు సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గానూ వ్యవహరించారు. భారతదేశ చలనచిత్ర వాణిజ్య మండలికి చైర్మన్‌గా సేవలందించిన ఏకైక కన్నడ వ్యక్తి ఆయన. బెంగళూరులో ఈ నిర్మాతకు కొన్ని థియేటర్లు ఉన్నాయి.
హిందూస్తాన్ మెషీన్ టూల్స్ (హెచ్‌ఎంటీ)లో ఉద్యోగి అయిన భక్తవత్సల సినిమాలపై ఆసక్తితో ఉద్యోగం వదులుకున్నారు ఆపై చిత్ర పరిశ్రమకు పరిచయమై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. భక్తవత్సల మృతిపట్ల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సంతాపం ప్రకటించారు.